బాన్సువాడ/ఎల్లారెడ్డి, జూన్ 23: యూరియా యాప్ రద్దు చేసే వరకు రైతుల పక్షాన ఉద్యమిస్తామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ స్పష్టం చేశారు. తాడ్వాయి లో చేపట్టనున్న ‘నిరసన’లో పాల్గొన కుండా అరెస్టు చేసి ఆయనను అక్కడి నుంచి బీర్కూర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన బీర్కూర్, తాడ్వాయిలో విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలు, రైతులను మోసం చేసిన రేవంత్‌రెడ్డి ఒక జోకర్ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. పాలన చేతకాని దద్దమ్మ అని విమర్శించారు.
యూరియా యప్ తెచ్చి రైతులను ఆగం చేస్తున్నదని మండిపడ్డారు. యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు అల్లాడుతుంటే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్కు తెలియడం లేదని, ఆయన గూండాలు, పోలీసులను పక్కనబెట్టి గ్రామాల్లో పర్యటిస్తే వాస్తవాలు తెలుస్తాయని జాజాల సురేందర్ సూచించారు. ఆయనకు రైతుల కష్టాలు తెలియదని, నియోజక వర్గం లో సాగు భూమి ఎంత ఉందో కూడా అయనకు తెలియదన్నారు. కాంగ్రెస్ నాయకులు సైతం తనకు ఫోన్ చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారని జాజాల తెలిపారు.
ఠాణా వద్ద బీఆర్ఎస్ శ్రేణుల ధర్నా
జాజాల సురేందర్‌ను అరెస్టు చేసి బీర్కూర్ పోలీసుస్టేషన్‌కు తీసుకువచ్చిన విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఠాణాకు చేరుకున్నాయి. జాజాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీర్కూర్- బిచ్కుంద రోడ్డుపై ధర్నా చేపట్టారు. జాజాలను విడుదల చేయడంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన విరమించారు.