హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): మహేశ్ బ్యాంక్ సర్వర్‌ను హ్యాక్ చేసి రూ.12.90 కోట్లు కొల్లగొట్టిన కేటుగాళ్ల కోసం హైదరాబాద్ పోలీసుల వేట కొనసాగుతున్నది. ఈ కేసు మిస్టరీని చేధించేందుకు నాలుగు బృందాలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. ఈ వ్యవహారంలో హ్యాకర్లు తమ వివరాలు తెలియకుండా ఉండేందుకు కరెంట్ ఖాతాలను ఎంపిక చేసుకొన్నట్టు సమాచారం. సాధారణంగా ఏదైనా సేవింగ్ ఖాతాలకు నేరుగా లేదా ఆన్లైన్లో భారీగా నగదు బదిలీ చేసినప్పుడు ఆర్బీఐతోపాటు ఐటీ శాఖ వారికి ఓ రెడ్ ట్యాగ్ వెళ్తుంది. అలా జరిగితే హ్యాకింగ్ గురించి వెంటనే తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో హ్యాకర్లు ముందుగానే ఓ బ్లూప్రింట్‌ను రూపొందించుకొన్నారని, రెడ్ట్యాగ్ వెళ్లకుండా చూసుకొనేందుకు తొలుత వివిధ వ్యాపార సంస్థల కరెంట్ ఖాతాల్లోకి నగదును బదిలీ చేశారని తెలుస్తున్నది. ఇలా బదిలీ అయిన నగదును వెంటనే అక్కడి నుంచి తక్కువ మొత్తాల్లో 128 ఖాతాలకు బదిలీ చేసినట్టు దర్యాప్తులో బయటపడింది. దీంతో ఈ 128 ఖాతాలు ఎవరివో గుర్తిస్తే హ్యాకర్ల ఆచూకీ దొరకవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. వారిలో ఇద్దరిని నైజీరియన్లుగా, మిగతావారిని ఉత్తరాదికి చెందినవారుగా గుర్తించారు.