
వెంగళరావునగర్, జనవరి 8: మధురానగర్ కాలనీ లింక్‌రోడ్డు నిర్మాణంపై మరోసారి అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చిస్తామని మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వెంగళరావు నగర్ డివిజన్ మధురానగర్‌లో ఉన్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో అనాథ పిల్లలతో పాటు కరోనాతో తల్లిదండ్రుల్ని కోల్పోయిన పిల్లల సంక్షేమంపై క్యాబినె ట్ సబ్ కమిటీ శనివారం సమావేశమైంది. అనంతరం మధురానగర్ కాలనీవాసులతో కలిసి జాబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, వెంగళరావు నగర్ కార్పొరేటర్ దేదీప్య మంత్రి కేటీఆర్‌కు మధురానగర్ లింక్‌రోడ్డు నిర్మాణంపై వినతిపత్రాన్ని సమర్పించారు. దీంతో మంత్రులు కేటీఆర్, సత్యవతి రాథోడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌లు కలిసి మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు.
కాలనీ అసోసియేషన్ సభ్యులు మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ప్రాంగణంలో ఉన్న స్థలాన్ని మంత్రికి చూపించి ప్రహరీ కొంతభాగం తొలగిస్తే సమస్య పరిష్కారం అవుతుందని వివరించారు. అనంతరం ఇటు కాలనీవాసులు, అటు స్టేట్ హోం అధికారులకు సర్దిచెప్పిన మంత్రి త్వరలోనే స మావేశమై ఓ నిర్ణయం తీసుకుందామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సీఎన్ రెడ్డి, రాజ్ కుమార్ పటేల్, బాబా ఫసియుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్టేట్ హోంకు వచ్చిన మంత్రి కేటీఆర్‌కు చిన్నారులు గులాబీ పూలతో స్వాగతం పలికారు. చిన్నారులను ఆప్యాయంగా పలుకరించిన మంత్రి శిశు విహార్‌లో సిబ్బంది ప్రవర్తనపై అడిగి తెలుసుకున్నారు.