వరంగల్ : గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న గంజాయి స్మగ్లర్ పై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ వీ రంగనాథ్ పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు జిల్లా పందికుంట గ్రామానికి చెందిన చెక్క కుమార స్వామికి ఆత్మకూరు ఇన్స్పెక్టర్ రవిరాజు హైదరాబాద్లోని చర్లపల్లి కారాగారంలో జైలర్ సమక్షంలో పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను శుక్రవారం అందజేశారు.
పీడీ యాక్ట్ ఉత్తర్వులు అందుకున్న నిందితుడు సులభంగా డబ్బు సంపాదించలానే ఆలోచనతో తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఎక్కువ ధరకు మహారాష్ట్ర, హైదరాబాద్ ప్రాంతల్లో విక్రయించేవాడు. ఈ ఏడాది మే 29న నిందితుడు కారులో 24 లక్షల రూపాయల విలువ గల 120 కేజీల గంజాయిని హైదరాబాద్కు తరలిస్తుండగా ఆత్మకూరు పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
నిందితుడిపై ములుగు, మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదుకాగా, మహారాష్ట్రలోను రెండు కేసులు నమోదయ్యాయి. దేశ అభివృద్ధి కీలకంగా నిలిచే యువతకు మత్తు పదార్థాలకు బానిసలుగా మార్చి యువత భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న గంజాయి విక్రయదారులపై కఠినంగా వ్యవహరించడంతో పాటు వారిపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని పోలీస్ కమిషనర్ గంజాయి విక్రయదారులను హెచ్చరించారు.