హనుమకొండ, అక్టోబర్ 14: కోల్‌కతా నేతాజీ సుభాష్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో 2024-25 విద్యాసంవత్సరానికి గాను జిమ్నాస్టిక్స్ డిప్లొమా ఇన్ కోచింగ్‌లో వరంగల్ జిమ్నాస్ట్లైన సూర్యదేవ్, శివసాయి, ప్రశాంత్ అత్యుతమైన ర్యాంకులతో డిప్లొమా సాధించారు. అందులో పేర్న సూర్యదేవ్ 72.12 శాతంతో మొదటి స్థానం సంపాదించి టాప్‌లో నిలిచారు. జంగా శివసాయి 68.7 శాతంతో 4వ ర్యాంక్ సాధించగా, టి.ప్రశాంత్ 60.83 శాతంతో సెకండ్ డివిజన్లో ఉత్తీర్ణత సాధించారు.
వరంగల్ జిమ్నాస్టిక్ అకాడమీలో 2009 నుంచి 2021 వరకు శిక్షణ పొందిన వీరు ఉమ్మడి వరంగల్ జిల్లా ద్వారా మన రాష్ర్టనికి ప్రాతినిధ్యం వహించి వివిధ జాతీయ జిమ్నాస్టిక్ పోటీల్లో పాల్గొని పలు పతకాలను సాధించడమే కాకుండా కాకతీయ యూనివర్సిటీ ద్వారా అఖిల భారత యూనివర్సిటీ పోటీల్లో కూడా పతకాలు సాధించారు. ఉన్నతస్థాయి ప్రమాణాలు కలిగిన క్రీడాకారులకు మాత్రమే ప్రవేశం కలిపించి క్రీడా శిక్షకులను తయారుచేసే శిక్షణ సంస్థ అయిన నేతాజీ సుభాష్ సు షనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ కోల్‌కతాలో 2024-25 విద్యాసంవత్సరానికి వారు ప్రవేశం సంపాదించారు.
ఈ జాతీయ క్రీడా సంస్థలో నిర్వహించే కఠినమైన ప్రవేశ పరీక్షల్లోను సూర్యదేవ్ మొదటి స్థానం, శివసాయి మూడవ స్థానం సంపాదించారు. 20 సీట్లకే పరిమితమైన ఈ జాతీయ క్రీడాసంస్థలో ఒకే ప్రాంతం నుండి ఒకే సంవత్సరంలో ముగ్గురు అడ్మిషన్ సాధించి ఉత్తమ ఫలితాలు సాధించడం ఘనత కాగా, అదే స్ఫూర్తితో శిక్షణ కొనసాగించి డిప్లొమాలోను అదే రాంకు సాధించడం మరో ఘనతగా చెప్పవచ్చని వరంగల్ జిమ్నాస్టిక్స్అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్.రమేశ్‌రావు, ప్రధాన కార్యదర్శి ఏ.సాంబయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యకుడు మధుసూదన్, శ్రీనివాసరావు, సోమరాజు, కమలాకర్, కార్యదర్శి సాంబయ్య, ట్రెజరర్ భరద్వాజ, ఇతర కార్యవర్గ సభ్యులు, ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ అజీజ్‌ఖాన్, ఇతర సంఘాల సభ్యులు వారికి అభినందనలు తెలిపారు.