నర్సంపేట రూరల్, మార్చి 5: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. నర్సంపేట పట్టణం సర్వాపురం శివారు దామెర చెరువు సమీపంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బస్వరాజు సారయ్య, నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, కలెక్టర్ గోపి, జడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతితో కలిసి మంత్రి హరీశ్‌రావు శనివారం మహిళా క్రీడోత్సవాలను ప్రారంభించారు.
అనంతరం రూ. 66 కోట్లతో నూతనంగా నిర్మించనున్న 330 పడకల జిల్లాస్థాయి దవాఖాన, టీ డయాగ్నస్టిక్ హబ్, 26 హెల్త్ సబ్ సెంటర్ల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత దవాఖాన నిర్మాణ స్థలంలో మంత్రులు మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఝూటాబాజీ పాలన కొనసాగిస్తున్నదన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నట్లు తెలిపారు. రైతులకు ఉచిత విద్యుత్ పథకం ప్రధానమంత్రి మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తెలంగాణను మోసం చేయాలని చూస్తున్నదని, రూ. 25 వేల కోట్లు ఇస్తామని చెప్పి రైతులు బావుల వద్ద మీటర్లు పెట్టే కుట్ర చేస్తున్నదని, ఈ ప్రతిపాదనను సీఎం కేసీఆర్ తిరస్కరించారని వివరించారు. పేదలకు వైద్య సేవలు అందించడంలో దేశంలో తెలంగాణ రాష్ట్రం ముందు వరుసలో ఉన్నదని, స్వయం సహాయక సంఘాల సభ్యులకు ఈ నెలాఖరులోగా వడ్డీ లేని రుణాలు అందజేస్తామని భరోసా ఇచ్చారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలపై ప్రజల తిరుగుబాటు తప్పదని హెచ్చరించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఓట్ల కోసం కాకుండా మానవీయంగా ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆరేనని అన్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా 10 లక్షల మందికి రూ. 9 వేల కోట్లు ఇచ్చారని మంత్రి హరీశ్‌రావు అన్నారు.
అందుబాటులో కార్పొరేట్ వైద్యం
పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కరోనా సమయంలో ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎంల సేవలు మరువలేనివని కొనియాడారు. కరోనా థర్డ్‌వేవ్‌లోనూ ఇంటింటికీ వెళ్లి జ్వర సర్వే నిర్వహించి మెడికల్ కిట్లను పంపిణీ చేసి రాష్ర్టానికి మంచి పేరు తెచ్చారని అభినందించారు. తెలంగాణ డయాగ్నస్టిక్ సెంటర్లో 57 రకాల పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. పేదలకు వైద్యం దగ్గర చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, 26 సబ్ సెంటర్లను రాష్ట్రంలో నర్సంపేటకే మొదట మంజూరు చేశామని చెప్పారు. ఎమ్మెల్యే పెద్ది విజ్ఞప్తి మేరకు ఒక్కో సబ్ సెంటర్‌కు రూ.20లక్షలతో మరో 13 ఏఎన్ఎం సబ్ సెంటర్లను మంజూరు చేస్తున్నామని మంత్రి తెలిపారు. నెక్కొండ, దుగ్గొండి పీహెచ్సీలో వైద్య సదుపాయాల మెరుగుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైద్యంలో మన రాష్ర్టాన్ని దేశానికే మార్గదర్శకంగా చేయడమే ఆశయమన్నారు.
మాదన్నపేట మినీ ట్యాంక్ బండ్ అభివృద్ధి కోసం రూ.10కోట్ల నిధులను వెంటనే క్లియరెన్స్ చేయిస్తానని భరోసా ఇచ్చారు. జిల్లా స్థాయి దవాఖాన, టీ-డయాగ్నస్టిక్ సెంటర్లు ఎమ్మెల్యే పెద్ది కృషితోనే నర్సంపేటకు వచ్చాయన్నారు. అమెరికా, యూరప్‌లో 20-30శాతం మాత్రమే ఆపరేషన్లు అవుతాయని, కానీ తెలంగాణలో 70-80శాతం ఆపరేషన్లు చేస్తున్నారని చెప్పారు. ఆశాలు, ఏఎన్ఎంలు, వైద్యులు, వైద్య సిబ్బంది సాధారణ ప్రసవంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. కేసీఆర్ కిట్ల వల్ల 30శాతం నుంచి 54 శాతం వరకు కాన్పులు ప్రభుత్వ దవాఖానల్లో జరుగుతున్నాయని, ప్రస్తుతం 24శాతం పెరిగిందని చెప్పారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాంనాయక్, అదనపు కలెక్టర్ హరిసింగ్, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, జడ్పీ ఫ్లోర్‌లీడర్ పెద్ది స్వప్న, డీపీవో స్వరూప, డీఆర్డీవో సంపత్‌రావు, డీఎల్పీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవో పవన్‌కుమార్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు, వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవారెడ్డి, టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, చైర్పర్సన్ గుంటి రజిని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట్‌రెడ్డి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, సివిల్ దవాఖాన సూపరింటెండెంట్ గోపాల్, డాక్టర్ మనోజ్‌లాల్, డాక్టర్ విరీన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామి, నాగుర్ల వెంకటేశ్వర్లు, భీరం సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా పీఆర్సీ: పల్లా
దేశంలో ఎక్కడ లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేస్తున్నామని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా 30 శాతం పీఆర్సీ అమలు చేశామనని, త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు.
సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉన్నాం: పెద్ది
నర్సంపేటలో జిల్లాస్థాయి దవాఖాన ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉన్నానని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు నర్సంపేట అభివృద్ధిని మరిచాయన్నారు. ప్రస్తుతం తాగునీరు, వ్యవసాయం రంగం, విద్యుత్ పరంగా అభివృద్ధి సాధించామన్నారు. గోదావరి జలాలను పాకాలతో అనుసంధానం చేసి రైతుల పాదాలు కడిగే అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ నర్సంపేట పట్టణాభివృద్ధికి మూడుసార్లు నిధులు మంజూరు చేశారన్నారు. నర్సంపేటకు బస్తీ దవాఖాన మంజూరు చేయాలని కోరారు.
మెరుగైన వైద్యం అందుతున్నది: ఎంపీ
రాష్ట్రంలో మంత్రి హరీశ్‌రావు ఆధ్వర్యంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నదని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రానున్న రోజుల్లో నర్సంపేటను హెల్త్ హబ్‌గా తీర్చిదిద్దడంలో మంత్రి సహాయ, సహకారాలు ఉండాలని కోరారు.