కొద్దిపాటి నీళ్లుంటే చాలు ఎవరైనా వరి వేద్దామనుకుంటారు. కానీ ధర్మసాగర్ రిజర్వాయర్ నీళ్లు పుష్కలంగా ఉండే దేవునూరులో మాత్రం వరి తక్కువగానే వేస్తారు. దానిని తరి భూముల్లో పండించే పంటగానే పరిమితం చేసి ప్రత్యామ్నాయ పంటలకే ప్రాధాన్యమిస్తున్నారు. ముఖ్యంగా పత్తి, మక్కజొన్న, మిరప, పసుపు, పొగాకు, పల్లికాయ, ఉల్లిగడ్డ, కూరగాయలు, పుచ్చ, కర్బూజ, జొన్నలు పండిస్తున్నారు. సంప్రదాయ పంటలకే పరిమితంగా కాకుండా కొత్త రకాలతో ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడుతారు. అందుకే ఊరి చుట్టూ ఎక్కడ చూసినా తీరొక్క పంటలతో పచ్చలహారం తొడిగినట్లు కనిపిస్తుంది. ఇలా ఏడాదిలో ముచ్చటగా మూడు పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
అన్ని పంటల సాగు ఇక్కడ
దేవునూరులో ఇప్పటికీ పత్తి పంటదే అగ్రస్థానం. సాగునీరు అందుబాటులో ఉన్నా మొదటినుంచి వరి తక్కువగానే వేస్తారు. ఇంకా గ్రామంలో 1,622 ఎకరాల దాకా సాగుభూమి ఉంది. వరితో పాటు పత్తి, మక్కజొన్న, మిరప, పసుపు, పొగాకు, పల్లికాయ, ఉల్లిగడ్డ, కూరగాయలు, పుచ్చ, కర్బూజ పంటలు పలు మాసాల్లో మనకు కనిపిస్తుంటాయి. అంతేకాదు ఇక్కడి రైతులు ‘వ్యవసాయ పంచాంగం’ ప్రకారం అన్ని రకాల పంటలు సాగుచేస్తారు. వరంగల్ నగరం గ్రామానికి దగ్గరగా ఉండడంతో అనేక మంది రైతులు తమ భూముల్లో కూరగాయలు కూడా సాగుచేసి లాభాలు గడిస్తున్నారు. ఇటీవల పొగాకు పంట కూడా బైబ్యాక్ పద్ధతిలో పలు కంపెనీలు ఇక్కడ సాగు చేయిస్తున్నాయి. ఇక ఉల్లిగడ్డ సాగులో మాత్రం ఊరి రైతులు ఆరితేరిపోయారు. గతంలో యాసంగిలో మాత్రమే సాగుచేసే ఉల్లిగడ్డను ఇప్పుడు అధికంగా ధర పలికేటువంటి వర్షాకాలంలో కూడా పండిస్తూ లాభాలు పొందుతున్నారు. పల్లికాయ సాగు కూడా ఇక్కడ అన్ని కాలాల్లో భిన్నంగా పండిస్తున్నారు. కొందరు రైతులు యాసంగిలో జొన్న పంటను కూడా ఇతర ప్రాంతాల నుంచి తెప్పించి పండించడం విశేషం. అంతేకాదు పంట క్షేత్రాల్లో ప్రయోగాలు చేయడమే కాదు.. దిగుబడుల్లోనూ రికార్డులు సృష్టిస్తున్నారు. ఒకప్పుడు కరువు గ్రామంగా పేరున్న ఈ ఊరికి పిల్లనియ్యాలంటే అదో పెద్దగట్ల రాజ్యమని ఆడపిల్లల తల్లిదండ్రులు ఆలోచించేవారు. కానీ ఇప్పుడిక్కడ వ్యవసాయ పనులు చేసేందుకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం నుంచి కూడా కూలీలు వస్తున్నారు.
ఊరి తలాపునే సాగునీటి రిజర్వాయర్
దేవునూరు సమీపంలోనే ధర్మసాగర్ రిజర్వాయర్ ఉంటుంది. ధర్మసాగర్ కంటే కూడా ఈ రిజర్వాయర్ దేవునూరుకే దగ్గరగా ఉంటుంది. రిజర్వాయర్ మొదట్లో వరంగల్ నగర దాహార్తిని మాత్రమే తీర్చడానికే మాత్రమే పరిమితంగా ఉండేది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ సర్కారు రిజర్వాయర్ను తాగు, సాగునీటి అవసరాలు తీర్చే నీటిబ్యాంకుగా మార్చారు. ఇదే కాకుండా ఎడమ కాల్వకు మొదటి గ్రామంగా దేవునూరు ఉంది. అలా గ్రామంలో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. అక్టోబర్ నెలలో సరాసరిగా కేవలం రెండు మీటర్ల లోతులోనే నీళ్లు ఉన్నాయి. గతంలో నీటి తడి ఎక్కువై పత్తిలో ఎండు తెగులు వచ్చి భారీ ఎత్తున పంటలు ఎండిపోయాయి. అయినప్పటికీ రైతులు వరి వైపు ఎక్కువగా వెళ్లకుండా చెల్కపంటలు వేస్తుండడం విశేషం. ఇప్పుడు వచ్చిన ‘వరి సంక్షోభం’లో గ్రామస్తులంతా తామంతా సర్కారు చెప్పినట్లు ఆరుతడి పంటలే వేస్తామని ముక్తకంఠంతో చెబుతున్నారు.
వ్యవసాయం ఇష్టంగా చేస్తారు..
దేవునూరు రైతులు పెద్ద మొత్తంలో ఎక్కువగా మెట్ట పంటలు పండించేందుకే ఇష్టపడుతారు. వీరు వ్యవసాయాన్ని ఇష్టంగా చేస్తారు. అందుకే అన్ని రకాల పంటలు పండిస్తారు. వ్యవసాయ శాఖ తరఫున కూడా మేం ప్రోత్సహిస్తున్నాం. గ్రామంలో నీటి వసతి ఎక్కువగా ఉన్నా వరి వైపు వెళ్లడం లేదు. పొలాలు చేద్దామనుకునే రైతులు కూడా ప్రస్తుత పరిస్థితులను బట్టి మనసు మార్చుకుంటున్నారు.
మెట్టతోనే ఎక్కువ లాభాలు
వరి పంటతో లాభాలు ఒక్కతీరుగానే ఉంటయ్. అదే మెట్ట పంటలకైతే ఒక్కో మంచి లాభాలు వస్తయ్. మార్కెట్ల కూడా డిమాండ్ ఉంటది. నష్టం మాత్రం తక్కువగానే ఉంటది. అయితే ఈ మధ్య పంటలకు కొంచెం రోగాలు, పురుగులు వస్తున్నయ్. మందులు కొట్టి కాపాడుతున్నం. నేను పత్తి, ఉల్లిగడ్డ, ఇంక పసుపు కూడా వేసిన. వరి కంటే నాకు చెల్క పంటలు పండిచ్చుడే మంచిగనిపిస్తది.
వరి లేనే లేదు
నేను, నా భర్త రాంచంద్రం కలిసి ఊర్లో నాలుగెకరాల్లో వ్యవసాయం చేసుకుంటున్నం. మేమసలు వరి జోలికి పోము. ఎకరం ఉల్లిగడ్డను, ఇంకో ఎకరంల మిరప, మిగాతా భూమిల పత్తి వేసినం. ఈ పంటలిప్పుడు మంచి పెరుగుతున్నయ్.దిగుబడి బాగనే వస్తది. పంట అయిపోంగనే ఇంకో పంటను వేస్తం. ఇట్ల అన్ని తీర్ల పంటలు వేస్తున్నం.
మూడెకరాల్లో మూడు పంటలు
నాడు మూడుకరాల భూమి ఉంది. మూడు రకాల పంటలు సాగు చేస్తున్నా. ప్రస్తుతం ఎకరం పొలం ఉండగా, మరో ఎకరంలో పత్తిని సాగు చేస్తున్నా. మరో ఎకరంలో వానకాలంలో ఉల్లిగడ్డను వేశాను. అయితే వర్షాల ఎక్కువ పడ్డప్పుడు ఉల్లి ఎక్కువ మొత్తంలో చెడిపోయింది. అయినా యాసంగిలో మళ్లీ వేస్తాను. ఓ పసలు వత్తది, ఓసారి పోతది. భయపడ్తే ఎవుసం ఎట్ల సాగుతది.