
వరంగల్, నవంబర్ 14 (నమస్తేతెలంగాణ): పంట మార్పిడిపై వ్యవసాయశాఖ అధికారులు ప్రచా రం చేపట్టారు. వరుసగా ఒకే పంట సాగు చేయటం వల్ల కలిగే నష్టాలను ఊరూరా రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. పంట మార్పిడితో చేకూరే ప్రయోజనాలను వివరిస్తున్నారు. యాసంగి సీజన్లో వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను వేయాలని సూచిస్తున్నారు. ప్రధానంగా ఆరుతడి పంటలను సాగుచేయటం ద్వారా లాభాలు పొందవచ్చంటున్నారు. ఆరుతడి పంటల విత్తనాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నట్లు చెబుతున్నారు. ఈమేరకు గ్రామాల్లో కరపత్రాలను కూడా పంపిణీ చేస్తున్నారు. క్లస్టర్ స్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. యాసంగి వడ్లను కొనబోమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలను సాగుచేయాలని కొద్దిరోజుల క్రితం ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు రైతులకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం పంట మార్పిడికి రైతులను ప్రోత్సహించే దిశలో అడుగులు వేస్తోంది. గతంలో మాదిరిగా రైతులు ఈ యాసంగిలోనూ వరికి బదులు లాభదాయకమైన ఇతర పంటలను సాగుచేయాలని అధికారులు ప్రచారం చేపట్టారు. వ్యవసాయ విస్తరణ అధికారు(ఏఈవో)లు, మండల వ్యవసాయ అధికారులు (ఎంఏవో)లు కొద్దిరోజులుగా గ్రామాలను సందర్శించి రైతులను కలుస్తున్నారు. యాసంగి వడ్లను కొనబోమని కేంద్రం వెల్లడించిన విషయాన్ని వివరిస్తున్నారు. వరికి ప్రత్యామ్నాయంగా యాసంగి సాగుచేయాల్సిన పంటల వివరాలను రైతులకు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆరుతడి పంటలను సాగుచేయటం లాభదాయకమని, నీరు పుష్కలంగా ఉన్నందున ఆరుతడి పంటల నుంచి మంచి దిగుబడులు సాధించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆరుతడి పంటల విత్తనాలేవి? ఒక్కో ఎకరంలో వాటిలో ఏ రకం విత్తనాలు ఎంత మోతాదులో వేయాలి? ఏ పంట నుంచి ఎంత దిగుబడి వస్తుంది? వరి పంట, ఆరుతడి పంటల సాగు, పెట్టుబడి, లాభాల్లో వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయిలో రైతుల ముందు పెడుతున్నారు? ప్రతి సంవత్సరం వానాకాలం, యాసంగి ఒక భూమిలో వరుసగా ఒకే పంటను సాగుచేయటం వల్ల భూసారం దెబ్బతింటుందని, చీడపీడలు పెరుగుతాయని, తద్వారా నష్టపోవాల్సి వస్తుందని, వరి పంట విషయంలోనూ ఇదే జరుగుతుందని రైతులకు పంట మార్పిడిపై అవగాహన కల్పిస్తున్నారు. యాసంగి వరికి బదులు ఇతర పంటలు సాగుచేస్తే భూమిలో భూసారం పెరుగుతుందని, అధిక దిగుబడులకు అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఆరుతడి పంటల ఉత్పత్తులకు ప్రభుత్వ మద్దతు ధర కూడా ఉందని రైతులకు గుర్తుచేస్తున్నారు. ఇదే విషయమై క్లస్టర్ స్థాయిలో రైతువేదిక భవనాల్లో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రైతులతోపాటు రైతుబంధు సమితి ప్రతినిధులను కూడా అవగాహన సదస్సులకు ఆహ్వానిస్తున్నారు.
ఆరుతడి పంటల విత్తనాలు ఇవే…
యాసంగి వరికి బదులుగా ఆరుతడి పంటలు సాగుచేయాలని రైతులకు చెబుతున్న ప్రభుత్వం అవసరమైన విత్తనాలను సైతం అందుబాటులోకి తెచ్చింది. గతంలో ఏటా రైతులు యాసంగి జిల్లాలో సాగుచేసిన వరి పంట విస్తీర్ణానికి సరిపడ ఆరుతడి పంటల విత్తనాలను వ్యవసాయశాఖ అధికారులు సిద్ధం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 1,17,695 ఎకరాలకు సరిపడ ఆరుతడి పంటల విత్తనాలు సుమారు 15వేల క్వింటా ళ్లు అందుబాటులో ఉన్నట్లు ప్రకటించారు. శనగలు 8,410, పెసర 1,852, రాగి 1,500, వేరుశనగ 1,460, మినుములు 770, కందులు 250, జనుము 246, సన్‌ఫ్లవర్ 313, జొన్న 155 క్వింటాళ్ల విత్తనాలు తెలంగాణ సీడ్స్, జాతీయ విత్తన సంస్థ (ఎన్ఎస్సీ), ప్రైవేటులో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం రెడీగా ఉన్న విత్తనాల్లో శనగలు దాదాపు 28వేల, పెసర్లు 24వేల, రాగి 37,500, మినుములు 9,627, సన్‌ఫ్లవర్ 7,825, జొన్న 3,875, కందులు 3,125, జనుము 2,460 ఎకరాల్లో వేయవచ్చని అంచనా వేశారు. నువ్వులు, ఆముదం కూడా అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. జనుము, శనగలు, కందులు, పెసర, మినుములు, వేరుశనగ విత్తనాలు తెలంగాణ సీడ్స్ కౌంటర్లలో ఉన్నాయని తెలిపారు. ఎన్ఎస్సీ వద్ద శనగలు, పెసర, మినుము, వేరుశనగ, రాగి విత్తనాలు దొరుకుతున్నాయని, ప్రైవేటు డీలర్ల వద్ద శనగ, పెసర, మినుము, వేరుశనగ, జొన్న, సన్‌ఫ్లవర్ తదితర ఆరుతడి పంటల విత్తనాలు లభిస్తున్నాయని ప్రకటించారు. రైతులు తమకు అందుబాటులో ఉన్న ఆగ్రోస్ కౌంటర్లలోనూ ఈ ఆరుతడి పంటల విత్తనాలను పొందవచ్చని తెలిపారు. ఆరుతడి పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉందని, వీటికి ప్రభుత్వ మద్దతు ధర కూడా ఉందని వ్యవసాయశాఖ అధికారులు వివరిస్తున్నారు.