గిర్మాజీపేట, జూన్ 8: అంగన్వాడీ సెంటర్లలో రెండున్నరేళ్ల పిల్లలను చేర్పించేలా తల్లిదండ్రులు అధికారులకు సహకరించాలని సీడీపీవో విశ్వజ కోరారు. బుధవారం సంబంధిత అధికారులతో కలిసి ఆమె 33వ డివిజన్లో ఇంటింటికీ తిరిగి పిల్లలను గుర్తించారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలను పంపాలని, ప్రైవేట్ స్కూళ్లకు పంపి పిల్లల బాల్యాన్ని భారం చేయొద్దని కోరారు.
పిల్లలను అంగన్వాడీ సెంటర్లకు పంపించడం వల్ల ప్రైవేట్ పాఠశాలల్లో కట్టే ఫీజును పొదుపు చేసుకొని పిల్లల పైచదువులకు వినియోగించవచ్చని సూచించారు. సూపర్వైజర్ ఆశాదేవి మాట్లాడుతూ ఆటపాటలు, కథలు, పరిసరాలు, మంచి అలవాట్లతో ప్రీస్కూల్ విద్య కొనసాగుతున్నదని, నిపుణులతో తయారు చేసిన ఎల్కేజీ పిల్లలకు నాలుగు సిలబస్ బుక్స్, యూకేజీ పిల్లలకు ఐదు పుస్తకాలు ఉచితంగా ఇచ్చి ఎవరి ప్రొఫైల్ బ్యాగ్ వారికే కేటాయించి, వారి బ్యాగ్, బుక్స్ అంగన్వాడీ కేంద్రంలోనే ఉంచి చదువుకోవచ్చని వివరించారు.
దీంతో పిల్లలపై భారం పడదని తెలిపారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరికీ ఉదయం 9 గంటలకు ఒక కోడిగుడ్డు, మధ్యాహ్నం పోషకాలతో కూడిన భోజనం, సాయంత్రం 3.20 గంటలకు మురుకులు స్నాక్స్‌గా అందిస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ భవాని, సిబ్బంది పాల్గొన్నారు.
వరంగల్ చౌరస్తా: పిల్లలను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్పించాలని డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ మసూద్ కోరారు. అంగన్వాడీ టీచర్లతో కలిసి ఆమె బడిబాట కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రం సాధించడంతోపాటు బంగారు తెలంగాణగా మార్చేందుకు దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని వివరించారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకం కొనసాగుతున్నదని తెలిపారు. పిల్లలకు అంగన్వాడీల్లో పౌష్టికాహారం అందించడంతోపాటుగా నిత్యకృత్యాలపై కనీస అవగాహన కల్పిస్తారని చెప్పారు.
నర్సంపేట/పర్వతగిరి/నల్లబెల్లి: ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన విద్య అందుతున్నదని నర్సంపేట మోడల్ స్కూల్ హెచ్ఎం రమేశ్‌బాబు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నర్సంపేటలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పలువురికి అడ్మిషన్లు కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని హెచ్ఎం తెలిపారు. విద్యార్థులకు మధ్యాహ్నం పౌష్టికాహారం అందిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు చెప్పారు.
ఈ విద్యా సంవత్సరం నుంచి ఇంగ్లిషం మీడియం బోధించనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యార్థి వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కుమారస్వామి, శ్రీనివాసరావు, రవీందర్, మురళి, శ్యామ్‌ప్రసాద్, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. పర్వతగిరి మండలం గుంటూరుపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో రూ. 44 లక్షలతో సర్పంచ్ రాపాక రేణుకా నాగయ్య అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సరోజన, నోడల్ అధికారి లింగారెడ్డి, ఉపసర్పంచ్ రాఘవులు, మాజీ ఎంపీటీసీ మహ్మద్ అలీ, ఎస్ఎంసీ చైర్మన్ వీరన్ననాయక్, హెచ్ఎం శ్రీనివాస్, సాంబయ్య, చిన్నం లక్ష్మీనారాయణ, జంగిలి బాబు, యాకయ్య, కృష్ణారావు పాల్గొన్నారు. నల్లబెల్లి మండలం పోషంపెల్లి ఎంపీపీఎస్ ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం కొలిపాక సంగీత ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు వినూత్నంగా ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీల వద్దకు వెళ్లి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎంసీ చైర్మన్ బండి ప్రభాకర్, కార్యదర్శి మౌనిక పాల్గొన్నారు.