‘హీరో’ చిత్రంతో తెరకు పరిచయమయ్యారు గల్లా ఆశోక్. మహేష్ బాబు మేనల్లుడిగా తెరంగేట్రం చేసిన ఈ యువ హీరో ప్రస్తుతం తన కొత్త చిత్రాల సన్నాహాల్లో ఉన్నారు. మంగళవారం అశోక్ పుట్టినరోజు. ఈ సందర్భంగా తన నట ప్రయాణాన్ని గురించి పాత్రికేయులతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ…‘సింగపూర్ బోర్డింగ్ స్కూల్లో చదువుకునేప్పుడు యాక్టింగ్ కోర్సులు నేర్పేవారు. షేక్స్పియర్ నాటకాల్లో నటించేవాడిని. అలా నటన మీద ఇష్టం పెరిగింది. హీరో సినిమా చేస్తున్నప్పుడు కమర్షియల్ హీరోగానే స్థిరపడాలి అనుకున్నాను. సినిమా విడుదలయ్యాక బాగా నటించావు, డాన్సులు చేసి ఆకట్టుకున్నావు అని చెప్పారు. మహేష్ బాబు దగ్గర నుంచి వచ్చిన ప్రశంసను మర్చిపోలేను. ఓటీటీలో విడుదలయ్యాక ఇంకా ఎక్కువ మంది ప్రేక్షకులకు నా సినిమా చేరువైంది. ఏదైనా మొదటి సినిమా ఫలితం విషయంలో పూర్తి సంతృప్తితో ఉన్నాను. ఈ ప్రోత్సాహంతో మరో రెండు మూడు ప్రాజెక్టులకు సన్నాహాలు చేసుకుంటున్నాను. నా తదుపరి సినిమా బయటి సంస్థలోనే ఉంటుంది. జూన్లో ఆ చిత్ర వివరాలు తెలియజేస్తాను. నాకు నటనలో మహేష్ బాబు స్ఫూర్తి. ఆయన ‘మురారి’ సినిమా నా ఫేవరేట్ మూవీ. అలాంటి చిత్రంలో నటించాలని కోరిక. మనల్ని మనం నమ్మాలి అనేది మహేష్ బాబు నుంచి నేర్చుకున్నాను. డ్యాన్సులు, ఫైట్స్ వంటివి చేయగలను కాబట్టి నటుడిగా పేరు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఇందుకు భావోద్వేగాలు ఉన్న కథలను వింటున్నాను. అలాంటి డెప్త్ ఉన్న కథలతోనే సినిమా చేయాలని ఉంది. ఇప్పుడే పాన్ ఇండియా సినిమాలు చేయాలని లేదు. ముందు తెలుగులో స్థిరపడాలి. హీరోగా పేరు తెచ్చుకోవాలి. ఆ తర్వాతే పాన్ ఇండియా ఆలోచన చేస్తా. అదీ నిర్మాతలు కోరుకుంటేనే. తాజాగా డ్రగ్ కేసులో నా పేరు వినిపించింది. ఆ రోజు ఇంట్లోనే ఉన్నా, వెన్నునొప్పి ఉంటే ఫిజియోథెరపీ చేయించుకుని పడుకున్నా. తెల్లవారి సోషల్ మీడియాలో నా గురించి వార్తలు చూసి ఆశ్చర్యపోయా. నేనూ సెలబ్రిటీ అయ్యానని అప్పుడు అనిపించింది. వెబ్ సిరీస్లో కొత్త తరహా కథలు తెరకెక్కుతున్నాయి. నాకూ అలాంటి వెబ్ సిరీస్లలో నటించాలని ఉంది’ అన్నారు.