భద్రాచలం, నవంబర్ 11: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాజిక మాధ్యమాలను వాడుకొని దేశంలో మతవిద్వేషాలను రెచ్చగొడుతున్నదని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు, మాజీ ఎంపీ బృందాకరత్ ఆరోపించారు. గురువారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మాజీ ఎమ్మెల్యేలు కుంజా బొజ్జి, సున్నం రాజయ్య స్థూపాలను ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రధాని మోదీ ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. కేంద్రం తెచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కొన్ని నెలలుగా ఉద్యమాలు చేస్తున్నా.. ప్రధానికి పట్టింపులేదని మండిపడ్డారు. మోదీ సర్కార్ గిరిజన రైతుల హక్కులను హరిస్తున్నదని ధ్వజమెత్తారు.