భీమ్‌గల్, ఫిబ్రవరి 7: అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంకా ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా శనివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేరలేదని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా 5వ వార్డులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఓ వృద్ధురాలు చూపిన ఆప్యాయతతో ప్రశాంత్‌రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ‘భీమ్‌గల్‌ను ఎంతో అభివృద్ధి చేసినవ్ బిడ్డా.. ఇంత చేసిన నువ్వు(బీఆర్ఎస్) గెలువకపోతే నేను సచ్చిపోతా’ అని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో భావోద్వేగానికి గురైన వేముల కంటతడి పెట్టారు. వృద్ధురాలిని దగ్గరికి తీసుకుని ఓదార్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రు కాల్చి వాతపెట్టేలా తీర్పు ఇవ్వాలని ఓటర్లను కోరారు.