Jwala Gutta : భారత బ్యాడ్మింటన్ మాజీ స్టార్ జ్వాలా గుత్తా (Jwala Gutta) తన కెరీర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సరైన మద్దతు లభించి, వివాదాలకు దూరంగా ఉండుంటే తాను ప్రపంచ నంబర్ వన్ (World No.1) అయ్యేదాన్నని ఆమె అభిప్రాయపడ్డారు. అప్పటి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) అధ్యక్షుడు వీకే వర్మ (VK Verma), ఇతర కోచ్‌లు తన కెరీర్‌ను దెబ్బతీయాలని చూశారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
2010 కామన్వెల్త్ గేమ్స్‌లో జరిగిన ఓ ఘటనను ఆమె గుర్తుచేసుకుంది. ఆ టోర్నీలో తాను, అశ్విని పొన్నప్ప డబుల్స్ స్వర్ణం గెలిచిన తర్వాత సైనా నెహ్వాల్ సింగిల్స్‌లో స్వర్ణం సాధించిందని తెలిపింది. తాము స్వర్ణం గెలిచినప్పుడు వీకే వర్మ పట్టించుకోలేదని, కానీ రెండు గంటల తర్వాత సైనా గెలవగానే అతడు కోర్టులోకి పరుగెత్తుకెళ్లి సంబరాలు చేసుకున్నాడని చెప్పారు. మా స్వర్ణం తక్కువేమీ కాదు కదా? అని తాను ఆనాడే ప్రశ్నించానని జ్వాల తెలిపారు.
వీకే వర్మ తన కెరీర్‌ను ముగించేందుకు తీవ్రంగా ప్రయత్నించాడని జ్వాల ఆరోపించారు. 2006లో ఎలాంటి కారణం చెప్పకుండా తనను జట్టు నుంచి తొలగించారని, మళ్లీ రియో ఒలింపిక్స్ తర్వాత కూడా అదే పునరావృతమైందని చెప్పారు. ఆ తర్వాత పోరాడి ప్రయోజనం ఏముందనిపించిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్రీడాకారుడూ, క్రీడాకారిణి వివాదాలు కోరుకోరని, కానీ తన హక్కుల కోసం పోరాడాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు.
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా దీనికి సరైన ఉదాహరణ అని, ఒక ప్రపంచ ఛాంపియన్‌ను తయారు చేయడానికి ఎంత వ్యక్తిగత శ్రద్ధ, పెట్టుబడి అవసరమో అతన్ని చూస్తే తెలుస్తుందని జ్వాల చెప్పారు. ఎలాంటి ఆర్థిక మద్దతు, స్పాన్సర్షిప్ లేకుండానే తాను వరల్డ్ నంబర్ 5కి చేరుకున్నానని, అదే మద్దతు ఉండి ఉంటే నంబర్ వన్ అయ్యేదాన్నని జ్వాల అన్నారు. క్రీడా వ్యవస్థలో మార్పు రావాలని, నేటి క్రీడారంగంలో రాజకీయ పలుకుబడి ఉన్నవారి మాటే నెగ్గుతోందని ఆమె వ్యాఖ్యానించారు.