న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారంటూ హీరో విశ్వక్ సేన్‌పై రాష్ట్ర హ్యూమన్ రైట్స్ కమిషన్‌లో ఫిర్యాదు అందింది. ఆయన కొత్త సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ ప్రచారం కోసం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ప్రాంక్ వీడియో చిత్రీకరించారు. అభిమానిని అంటూ ఆ వ్యక్తి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ప్రాంక్ వీడియో చేశారు. రోడ్డు మీద జరుగుతున్న ఇదంతా చూస్తున్న జనం షాక్ అయ్యారు. ఈ వీడియో బయటకు వచ్చి కలకలం సృష్టించింది. దీనిపై హైకోర్టు న్యాయవాది అరుణ్‌కుమార్ హెచ్చార్సీలో ఫిర్యాదు చేశారు. సినిమా హైప్ కోసం చేస్తున్న ఇలాంటి దిగజారుడు ప్రచారం, ప్రాంక్ వీడియోల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, యువతపై ఇవి తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తన ఫిర్యాదులో అరుణ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన ఫిర్యాదును మానవ హక్కుల కమిషన్ స్వీకరించింది. ఈ విషయంపై పలు న్యూస్ ఛానెల్స్‌లో చర్చకు వెళ్లిన విశ్వక్ సేన్ అక్కడి యాంకర్స్‌తో మాట్లాడిన భాష, చేసిన హంగామా కూడా వివాదాస్పదం అవుతున్నది. ఈ వివాదంపై విశ్వక్ సేన్ స్పందిస్తూ…‘సినిమా ప్రచారంలో భాగంగా ప్రాంక్ వీడియో చేశాం. అది మా ఇంటి సమీపంలోనే జరిగింది. చుట్టుపక్కల వాళ్లు మా ప్రాంక్‌ను చూసి సరదాగా నవ్వుకున్నారు కానీ భయపడలేదు. హెచ్చార్సీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు అతని ఒంటి మీద పోసుకున్నది పెట్రోల్ కాదు నీళ్లు. నా మీద ఏదైనా కేసులు వేసుకోండి కానీ ప్రాంక్ వీడియోలు చేసుకునే వారిని వదిలేయండి’ అన్నారు.