బెంగళూరు, ఫిబ్రవరి 8: ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ బీజేపీ మతచిచ్చు రాజేస్తుంది. సీఎం కే చంద్రశేఖర్‌రావు ఇటీవల చేసిన హెచ్చరిక ఇది. కర్ణాటకలో ప్రస్తుత పరిణామాలను గమనిస్తే ఇది నిజమేననిపిస్తున్నది. ప్రశాంతంగా ఉండే కర్ణాటకలో ప్రస్తుతం మత చిచ్చు రాజుకొన్నది. నిన్నటిదాకా ఒకే పాఠశాల, కాలేజీలో ఒకే బెంచిపై కూర్చొని పాఠాలు నేర్చుకొన్న విద్యార్థుల మధ్య నేడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. కొన్ని విద్యాసంస్థలు, వాటికి వెన్నుదన్నుగా నిలుస్తున్న ప్రభుత్వ యంత్రాంగం తీసుకొన్న వివాదాస్పద నిర్ణయాలు రాష్ట్రంలో యావత్ విద్యార్థి లోకాన్ని నిలువునా చీల్చింది. ఉడుపి జిల్లాలో మొదలైన హిజాబ్ వివాదం చిలికిచిలికి గాలివానగా మారి మతం రంగు పులుముకొన్నది. రెండు వర్గాలుగా విడిపోయి విద్యార్థులు పరస్పరం దాడులకు దిగారు. దీంతో విద్యాసంస్థలపై నియంత్రణ కోల్పోయిన బీజేపీ ప్రభుత్వం మూడురోజులపాటు అన్ని స్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది.
చేతులెత్తేసిన ప్రభుత్వం
ఉడుపిలోని మహాత్మాగాంధీ మెమోరియల్ ప్రభుత్వ కాలేజీలో రెండువర్గాల విద్యార్థుల మధ్య మంగళవారం ఘర్షణ ప్రారంభమైంది. ఇది రాష్ట్రమంతటా వ్యాపించి అన్ని జిల్లాల్లో విద్యార్థుల ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఉడుపిలో హిజాబ్, కండువాలు ధరించి రెండు వర్గాలుగా విడిపోయి నిరసనలు చేపట్టారు. బగాల్‌కోట్‌లో విద్యార్థులు పరస్పరం రాళ్లు రువ్వుకొన్నారు. శివమొగ్గలోని ఓ కాలేజీ వద్ద కొందరు విద్యార్థులు కాషాయ జెండా ఎగురవేశారు. రాళ్లు రువ్వుకొన్నారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు.
హరిహర, దావనగెరె పట్టణాల్లో విద్యార్థులు పరస్పరం ఘర్షణకు దిగారు. పరిస్థితిని అదుపుచేయటంలో ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరకు మూడురోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా హైస్కూళ్లు, కాలేజీలను మూసేస్తున్నట్టు సీఎం బసవరాజ్ బొమ్మై ప్రకటించారు. హిజాబ్ వివాదం మంగళవారం కర్ణాటక హైకోర్టుకు చేరింది. ఉడుపికి చెందిన కొందరు విద్యార్థులు కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. దీన్ని విచారించిన కోర్టు విద్యార్థులు సంయమనం పాటించాలని కోరింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. విద్యా సంస్థలను మూసేసినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితి నివురుగప్పిన నిప్పులాగే ఉన్నది.
డ్రెస్‌కోడ్ పాటించాల్సిందే: కేంద్రమంత్రి జోషి
విద్యాసంస్థల్లో విద్యార్థులంతా యూనిఫాం ధరించాల్సిందేనని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు. కొందరు రాజకీయ నాయకులు, మతోన్మాద శక్తులే ఈ అంశాన్ని రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. కర్ణాటకలో హిజాబ్‌పై నిషేధాన్ని బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఇందర్‌సింగ్ పారమార్ సమర్థించారు. యూనిఫాంలో హిజాబ్ భాగం కాదని స్పష్టంచేశారు. తమ రాష్ట్రంలో కూడా ఒకేవిధమైన డ్రెస్‌కోడ్‌ను అమలుచేస్తామని తెలిపారు. హిజాబ్ ధరించిందన్న కారణంగా ఓ ముస్లిం విద్యార్థినిని టీచర్ క్లాసులోకి రానివ్వని ఘటన పుదుచ్చేరిలోని అరియన్కుప్పంలో చోటుచేసుకొన్నది. దీనిపై దర్యాప్తు చేపట్టాలని డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సదరు స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించింది.
ఏమిటీ వివాదం?
గత నెలలో ఉడుపిలోని ప్రభుత్వ బాలికల కాలేజీలో ముఖాలకు హిజాబ్ ధరించి వచ్చిన ఆరుగురు విద్యార్థినులను యాజమాన్యం లోపలికి రానివ్వలేదు. హిజాబ్‌లు తీసేస్తేనే అనుమతిస్తామని చెప్పింది. అధికార బీజేపీకి అనుబంధంగా ఉండే విద్యార్థి, యువజన సంఘాల అభ్యంతరాల మేరకు ఈ నిర్ణయం తీసుకొన్నట్టు ప్రకటించింది. దీంతో వివాదం రాజుకొన్నది. బీజేపీ ప్రభుత్వం గత శనివారం జారీచేసిన ఒక ఆదేశం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. విద్యాసంస్థ యాజమాన్యం యూనిఫాంగా గుర్తించని ఎలాంటి వస్ర్తాలను విద్యార్థులు ధరించరాదని, సమగ్రత, సమానత్వానికి విఘాతం కలిగించేలా విద్యార్థుల వస్త్రధారణ ఉండరాదని ప్రకటించింది. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక వర్గం విద్యార్థులు హిజాబ్‌లు ధరిస్తుండటంతో వారికి వ్యతిరేకంగా మరో వర్గం విద్యార్థులు కాషాయ కండువా వేసుకొని స్కూళ్లు, కాలేజీలకు రావటం ప్రారంభించారు. సోషల్‌మీడియాలో ప్రచారం కావటంతో చుట్టుపక్కల జిల్లాలకు వ్యాపించింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవటంతో మంగళవారం హింసాత్మక ఘటనలు చోటుచేసుకొన్నాయి.
పోటాపోటీగా నినాదాలు
కర్ణాటక మండ్యలోని ఓ కళాశాలకు హిజాబ్ ధరించి వెళ్తున్న ఓ ముస్లిం విద్యార్థినిని కాషాయ స్కార్ఫ్‌లు ధరించిన కొందరు ముట్టడించారు. ‘జైశ్రీరామ్’ అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ఆ యువతి కూడా ‘అల్లా హు అక్బర్’ అంటూ గట్టిగా అరుస్తూ.. చెయ్యి పైకి లేపుతూ కళాశాలలోకి నడువడం వీడియోలో కనిపించింది. దీంతో ఆమెను ఓ వ్యక్తి అనుసరించగా.. ‘నేను బుర్ఖా ధరిస్తే మీకు వచ్చిన సమస్య ఏంటి?’ అని ఆ విద్యార్థిని ప్రశ్నించింది. ఇంతలో ఆ గుంపు విద్యార్థినిని సమీపిస్తుండగా.. కాలేజీ సిబ్బంది వచ్చి విద్యార్థినిని కళాశాలలోకి తీసుకెళ్లారు.