అగ్ర హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న పీరియాడిక్ చిత్రం ‘రణబాలి’ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నది. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది. రష్మిక మందన్న కథానాయిక. రాయలసీమ నేపథ్యంలో జరిగే ఈ కథలో విజయ్ దేవరకొండ 19వ శతాబ్దం నాటి చారిత్రక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. బ్రిటీష్ ప్రభుత్వం అరాచకాలకు వ్యతిరేకంగా పోరాడే యోధుడిగా ఆయన పాత్ర అత్యంత శక్తివంతంగా సాగుతుందని చెబుతున్నారు.
ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ గుర్రపుస్వారీలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఏపీలోని వైఎస్ఆర్ కడప జిల్లా గండికోటలో జరుగుతున్నది. కోట ముఖద్వారం, ధాన్యాగారంలో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. మరోవారం రోజుల పాటు అక్కడే షూటింగ్ జరుగుతుందని తెలసింది. ‘రణబాలి’ సెప్టెంబర్లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.