Vijay Deverakonda | టాలీవుడ్ మోస్ట్ క్రేజీ నటులుగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు గత కొద్దిరోజులుగా ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వీరి పెళ్లి వీడియో స్ట్రీమింగ్ హక్కుల కోసం ఒక ప్రముఖ అంతర్జాతీయ ఓటీటీ సంస్థ భారీ మొత్తాన్ని ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఈ ఆఫర్‌ను విజయ్ దేవరకొండ సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. గతంలో నయనతార – విఘ్నేష్ శివన్ వివాహ వీడియో స్ట్రీమింగ్ విషయంలో తలెత్తిన న్యాయపరమైన వివాదాలు, డాక్యుమెంటరీ విడుదల కావడానికి పట్టిన సమయం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ జంట అప్రమత్తమైనట్లు కనిపిస్తోంది. అలాగే తన వ్యక్తిగత జీవితంలోని అత్యంత ముఖ్యమైన వేడుకను వ్యాపారం చేయడం విజయ్‌కి ఇష్టం లేదని, అందుకే ఎన్ని కోట్లు ఆఫర్ చేసినా అంగీకరించలేదని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. తమ పెళ్లిని కేవలం కుటుంబ సభ్యులు, ఆత్మీయుల మధ్య అత్యంత ప్రైవేట్‌గా జరుపుకోవాలని వారు భావిస్తున్నట్లు తెలుస్తుంది.
తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 26, 2026న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వీరి వివాహం జరగనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమయ్యాయని నెట్టింట కొన్ని వీడియోలు వైరల్ అవుతున్నాయి. గతేడాది అక్టోబర్‌లోనే వీరిద్దరికీ నిశ్చితార్థం పూర్తయిందని వార్తలు వచ్చినప్పటికీ, ఈ జంట మాత్రం ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఏదేమైనా, తమ అభిమాన నటీనటులు ఒకటవుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.