న్యూయార్క్ : ఎత్తైన ప్రదేశాలంటే భయపడే వారు ఈ వీడియోను జాగ్రత్తగా చూడాలి. ఓ వ్యక్తి చాలా సన్నని పర్వత శిఖరంపై నడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ నార్త్ కాస్కేడ్స్ నేషనల్ పార్క్‌లోని ఎత్తైన పర్వత శిఖరానికి సంబంధించింది. ప్రస్తుతం వైరల్‌గా మారిన ఈ వీడియోను లెలాండ్ నికీ సెప్టెంబర్ 2న ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. నికీ తన బయోలో తాను అల్పినిస్ట్, ప్రొఫెషనల్ గైడ్‌గా పేర్కొన్నాడు.
ఈ షార్ట్ క్లిప్‌లో నికీ అత్యంత సన్నటి పర్వత శిఖరంపై నడుస్తూ కనిపించాడు. అతడు కేవలం హెల్మెట్ మాత్రమే ధరించాడు. అత్యంత సన్నటి పర్వత శిఖరాలను ఎక్కడాన్ని తాను ప్రేమిస్తానని నికీ చెప్పుకొచ్చాడు. రెండు రోజుల క్రితం బోస్టన్ బేసిన్‌కి వెళ్లాను..క్యాస్కేడ్ల చుట్టూ ఉన్న అన్ని అద్భుతమైన ప్రాంతాలను చూసి నేను ఆశ్చర్యపోయాను… చాలా చిన్న పర్వత శ్రేణులు కొత్త ప్రదేశాలతో అదంతా ఒక పెద్ద ప్లేగ్రౌండ్ లా ఉందని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చాడు.
ఈ వీడియోకు ఇప్పటివరకూ 24 వేల వ్యూస్ రాగా నెటిజన్లు పెద్దసంఖ్యలో రియాక్ట్ అయ్యారు. ఈ వీడియోను చూస్తూ భయపడ్డానని ఓ యూజర్ కామెంట్ చేయగా, కొద్ది వారాల కిందటే ఈ పర్వతాలను ఎక్కాను..ఇది నమ్మశక్యం కాని అనుభవమని మరో యూజర్ రాసుకొచ్చాడు.