Navnindra Behl | బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటి, రచయిత్రి, థియేటర్ ఆర్టీస్ట్ నవనీంద్ర బెహల్ (76) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం తుది శ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె కుమారుడు ప్రముఖ సినీ దర్శకుడు కాను బెహల్ సోషల్ మీడియా వేదికగా తెలుపుతూ పోస్ట్ పెట్టాడు. కేవలం మూడు ఏళ్ల వయసులోనే రంగస్థలంపై అడుగుపెట్టిన నవనీంద్ర బెహల్, పంజాబ్ యూనివర్సిటీలో డ్రామా విభాగంలో లెక్చరర్‌గా కూడా సేవలందించారు.
కంగనా రనౌత్ నటించిన ‘క్వీన్’ సినిమాలో అమ్మమ్మ పాత్రలో ఆమె చేసిన నటన ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ‘మాచిస్’, ‘ఓయ్ లక్కీ! లక్కీ ఓయ్!’, ‘ముక్తి భవన్’ వంటి విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాల్లో ఆమె నటించింది. ఇక వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా ఆమె తనదైన ముద్ర వేశారు. ముఖ్యంగా స్టార్ ప్లస్‌లో ప్రసారమైన పాపులర్ సీరియల్ ‘ఇష్క్బాజ్’లో నకుల్ మెహతాకు దాదీగా నటించి ఇంటింటికీ చేరువయ్యారు. ఆమె భర్త, ప్రముఖ నటుడు, దర్శకుడు లలిత్ బెహల్ 2021లో కోవిడ్ కారణంగా మరణించగా.. ఇప్పుడు నవనీంద్ర మరణంతో బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అనురాగ్ కశ్యప్, గునీత్ మోంగా వంటి ప్రముఖులు ఆమె మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నారు.