న్యూఢిల్లీ: వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అరెస్ట్ చేయడానికి కారణంగా డ్రగ్స్ బూచిని చూపిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసలు లక్ష్యం ఆ దేశంలోని భారీ చమురు నిక్షేపాలను కొల్లగొట్టడమేనని విశ్లేషకులు అంటున్నారు! అమెరికా మాజీ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. మదురో నియంత, కిరాతకుడు అనే మాట నిజమే కానీ, ప్రెసిడెంట్ ట్రంప్ చేసిన పని చట్టవిరుద్ధం, నిర్లక్ష్యపూరితం అని విమర్శించారు. యూఎస్ సెనేటర్ బెర్నీ శాండర్స్ ఇచ్చిన పోస్ట్‌లో, వేరొక దేశంపై దాడి చేసే అధికారం ట్రంప్‌నకు లేదని పేర్కొన్నారు. ఇప్పుడు తన నియంత్రణలో ప్రపంచంలోనే భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయని, వీటి విలువ రూ.1,557 లక్షల కోట్లు అని ట్రంప్ మీడియాకు తెలిపారు. అమెరికాకు చెందిన పెద్ద ఆయిల్ కంపెనీలు వెనెజువెలాకు వెళ్తాయని, బిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టి, సొమ్ము సంపాదించుకుంటాయని చెప్పారు.
అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం, వెనెజువెలాలో 300 బిలియన్ బ్యారెళ్ల కన్నా ఎక్కువ చమురు నిక్షేపాలు ఉన్నాయి. ప్రపంచంలోని మొత్తం చమురు నిల్వల్లో ఇది 20 శాతం. దీని విలువ రూ.1,557 లక్షల కోట్లు అని అంచనా. ఈ చమురు హెవీగా ఉంటుంది, విద్యుదుత్పత్తి కేంద్రాలు, సిమెంట్ పరిశ్రమలు, నౌకలు, రోడ్డు నిర్మాణం, వాటర్ప్రూఫింగ్ల కోసం కూడా వాడతారు. అమెరికాకు 50 బిలియన్ బ్యారెళ్ల చమురు నిక్షేపాలు ఉన్నాయి. ఇది లైట్, స్వీట్ క్రూడ్. పెట్రోలు తయారీకి ఇది సరైనదే. ఇతర ఉత్పత్తుల తయారీకి అనువైనది కాదు. వెనెజువెలాలో రోజుకు 1 మిలియన్ బ్యారెళ్ల చమురు మాత్రమే ఉత్పత్తి అవుతుంది. అంటే ప్రపంచం మొత్తం మీద రోజుకు ఉత్పత్తి అయ్యే చమురులో కేవలం 0.8 శాతం మాత్రమే వెనెజువెలాలో ఉత్పత్తి అవుతుంది.
ప్రపంచంలో అత్యధిక చమురు నిక్షేపాలు ఉన్న వెనెజువెలా తలసరి ఆదాయం విషయంలో 2025లో ప్రపంచంలో 127వ స్థానంలో ఉంది. దేశ జనాభాలో 90 శాతం మంది పేదలే. 2018లో ద్రవ్యోల్బణం 1.7 మిలియన్ శాతానికి చేరుకుంది. ఫలితంగా 50,000; 1,00,000 డినామినేషన్ నోట్లను ప్రభుత్వం ముద్రించింది. కోడిగుడ్లు కొనడానికి ప్రజలు 1,00,000 విలువ గల నోట్లను 20 తీసుకోవలసి వచ్చేది. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి వల్ల దేశం ఈ దుస్థితిలో ఉంది. దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం చమురుపైన మాత్రమే ఆధారపడింది. 1970వ దశకంలో ఈ దేశంలో రోజుకు 3.5 మిలియన్ బ్యారెళ్ల చమురు ఉత్పత్తి జరిగేది. అంటే, ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్న చమురులో సుమారు 7 శాతం అన్నమాట. క్రమంగా చమురు ఈ దేశ అతి పెద్ద బలహీనతగా మారింది. చమురు పరిశ్రమను 1976లో జాతీయీకరణ చేశారు. పీడీవీఎస్ఏ అనే ప్రభుత్వ కంపెనీని ఏర్పాటు చేశారు.
2002-03లో సమ్మె జరిగింది. ప్రభుత్వం 18,000 మంది వర్కర్లను తొలగించింది. చమురు నుంచి బిలియన్ల డాలర్లు సంపాదించినప్పటికీ, నిధులను పొదుపు చేయలేదు. 1980వ దశకంలో ధరలు పతనమవడంతో, మొత్తం వ్యవస్థ కుప్పకూలింది, ప్రజాగ్రహం వెల్లువెత్తింది. 1992లో ప్రజలు ప్రెసిడెంట్ హ్యూగో ఛావెజ్‌పై తిరుగుబాటు చేశారు. కానీ విఫలమయ్యారు. 2004-2008 మధ్య కాలంలో చమురు ధరలు బ్యారెల్‌కు 140 డాలర్లకు పెరిగాయి. భారీ లాభాలు రావడంతో, ప్రభుత్వం ఉచిత గృహ నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, చౌక ధరలకు ఆహారం పథకాలను ప్రవేశపెట్టింది. ల్యాప్‌టాప్‌లు, నిత్యావస వస్తువులను పంపిణీ చేసింది.ప్రభుత్వం బలవంతంగా ఆహార ధరలను తగ్గించింది. ప్రైవేట్ కంపెనీలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఫలితంగా ఉత్పత్తిని నిలిపేశాయి. ప్రభుత్వం చమురు ద్వారా వచ్చిన సొమ్ముతో అన్నిటినీ దిగుమతి చేసుకోవడం ప్రారంభించింది. దేశంలోని పరిశ్రమలు మూతపడ్డాయి, నిరుద్యోగం పెరిగిపోయింది.
పీడీవీఎస్ఏని ఏర్పాటు చేసిన తర్వాత చాలా విదేశీ కంపెనీలు ఉత్పత్తిని నిలిపేశాయి. ప్రభుత్వం వాటి ప్లాంట్లను స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత విదేశీ పెట్టుబడులు చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదు. నైపుణ్యం గల ఇంజినీర్లు, నిపుణులు పీడీవీఎస్ఏని వదిలిపెట్టారు, వారి స్థానాల్లో రాజకీయ ప్రేరేపిత నియామకాలు జరిగాయి. కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టలేదు, మెషినరీని మెయింటెయిన్ చేయలేదు. ఫలితంగా చమురు వెలికితీత సామర్థ్యం తగ్గుతూ వచ్చింది. 50 ఏళ్ల నుంచి పైప్లైన్లను అప్డేట్ చేయలేదని, రిఫైనరీలు దయనీయస్థితిలో ఉన్నాయని పీడీవీఎస్ఏ సర్ది చెప్తున్నది. మౌలిక సదుపాయాల పునరుద్ధరణ, ఉత్పత్తి పునఃప్రారంభం కోసం 58 బిలియన్ డాలర్ల మేరకు ఖర్చవుతుంది.
గతంలో వెనెజువెలా చమురుకు అతి పెద్ద కొనుగోలుదారు అమెరికా. ఛావెజ్ విధానాలు, ప్రకటనల వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. ఆ తర్వాత వెనెజువెలా చమురుకు అతి పెద్ద కొనుగోలుదారుగా చైనా మారింది. చమురుకు బదులుగా 10 బిలియన్ డాలర్ల రుణాలను చైనా ఇచ్చింది. వెనెజువెలా చమురును అమ్ముతున్నప్పటికీ, ఆదాయాన్ని సంపాదించలేకపోతున్నది. 2018లో వెనెజువెలా ప్రభుత్వం అమెరికన్ డాలర్లలో వ్యాపారాన్ని నిషేధించింది. ఒక డాలర్‌కు 10 బొలివర్స్ ఎక్సేంజ్ రేట్‌ను నిర్ణయించింది. కానీ మార్కెట్ రేటు ఒక డాలర్‌కు 1,000కిపైగా బొలివర్లు ఉంది. 2019 తర్వాత అమెరికా, ఇతర దేశాలు వెనెజువెలా ఆయిల్ కంపెనీపై ఆంక్షలు విధించాయి. దీంతో చమురు అమ్మకాలు, పెట్టుబడులను ఆకర్షించడం కష్టంగా మారింది. వీటన్నిటి వల్ల వెనెజువెలా దయనీయ స్థితికి చేరింది.
వెనెజువెలాలో సుమారు 303 బిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్ ఉంది. దీనిని లీటర్ సుమారు 60 పైసలకు అమ్ముతున్నది. ఇక్కడి చమురుకు అతి పెద్ద కొనుగోలుదారు చైనా. 70-90 శాతం చమురును చైనా కొంటున్నది. ఇప్పుడు వెనెజువెలా చమురు రంగంలో భారీగా పెట్టుబడులు పెడతామని ట్రంప్ చెప్పారు. ట్రంప్ ప్రణాళిక విజయవంతమైతే, అమెరికా కూడా మిలియన్ల బ్యారెళ్ల చమురును దిగుమతి చేసుకోగలుగుతుంది.
వెనెజువెలా చమురు నిక్షేపాలపై ట్రంప్ దృఢమైన నిర్ణయం తీసుకోకపోతే, చమురు ధరలపై ప్రభావం పెద్దగా ఉండదని విశ్లేషకులు చెప్తున్నారు. వెనెజువెలా చమురు ఉత్పత్తిని 5-10 శాతం నుంచి 50 శాతానికి అమెరికా పెంచగలిగితే, చమురు ధరలపై ప్రభావం పడుతుందని చెప్తున్నారు. మన దేశంలో కూడా పెట్రోలు, డీజిల్ ధరలు కొంత మేరకు తగ్గవచ్చునన్నారు. అయితే, దీనికి కొంత సమయం పడుతుందని చెప్పారు. అమెరికా చెప్పుకోదగినంత చేయకపోతే, మార్పులేవీ ఉండవని తెలిపారు.
ప్రపంచంలో అధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు చమురు నిల్వలు (బిలియన్ బ్యారెళ్లలో)
