Varanasi |దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’ పై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ కొనసాగుతోంది. గ్లోబల్ అడ్వెంచర్ నేపథ్యంతో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆసక్తి నెలకొంది. నవంబర్ 2025లో విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఆ గ్లింప్స్‌లో మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో స్టైలిష్‌గా కనిపించగా, ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా, పృథ్వీరాజ్ సుకుమారన్ ‘కుంభ’ అనే ప్రతినాయక పాత్రలో దర్శనమిచ్చారు. సుమారు రూ.1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఇటీవల హైదరాబాద్‌లో అంతర్జాతీయ మీడియాతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ సినిమాకు సంబంధించిన కీలక విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్‌కు సీక్వెల్ ఉంటుందా లేదా అన్న అంశంపై ఆయన స్పష్టత ఇచ్చారు. మొదట్లో కథను రెండు భాగాలుగా తెరకెక్కించాలని ఆలోచించినప్పటికీ, తర్వాత స్క్రిప్ట్ నిర్మాణాన్ని పరిశీలించి ఒకే భాగంలో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ‘వారణాసి’ ఒకే భాగంగా ప్రేక్షకుల ముందుకు రానుందని, దాదాపు మూడు గంటల నిడివితో గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని పేర్కొన్నారు. దీంతో పార్ట్–2పై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పడినట్టైంది.
నిర్మాణ పరంగా కూడా ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతోంది. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్ నారాయణ, షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై ఎస్ఎస్ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తుండటం ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించనుండగా, ఇటీవల బాలీవుడ్లో బ్లాక్‌బస్టర్ అందుకున్న ఒక ప్రముఖ తమిళ స్టార్ హీరో కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ టీమ్, పాన్ వరల్డ్ రిలీజ్ ప్లాన్‌తో ‘వారణాసి’ భారతీయ సినిమా చరిత్రలో మరో మైలురాయిగా నిలిచే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాజమౌళి–మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తుందనే నమ్మకం అభిమానుల్లో స్పష్టంగా కనిపిస్తోంది.