జబల్పుర్: వందేభారత్ రైలు రికార్డు క్రియేట్ చేసింది. ట్రయల్ రన్లో ఆ రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. శుక్రవారం టెస్ట్ రన్ నిర్వహించారు. ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తన ట్విట్టర్లో తెలిపారు. కోటా-నాగ్డా సెక్షన్ మద్య రైలు వేగాన్ని పరీక్షించారు. టెస్ట్ రన్ నిర్వహిస్తున్న సమయంలో రైలులో వాషింగ్, క్లీనింగ్‌తో పాటు అన్ని పరికరాల పనితీరును పరిశీలించినట్లు ఆయన వెల్లడించారు. కోటా-నాగ్డా రూట్లో రైలు స్పీడ్ లెవల్స్‌ను టెస్ట్ చేసినట్లు మంత్రి తెలిపారు. 16 కోచ్‌లతో వందేభారత్ రైలును పరీక్షించారు.
కోటా డివిజన్లో వివిధ దశల్లో ట్రయల్స్ చేపట్టారు. కోటా నుంచి ఘాట్ కా బరానా మధ్య మొదటి దశ ట్రయల్, ఘాట్ కా బరానా నుంచి కోటా మధ్య రెండో దశ ట్రయల్, కుర్లాసీ నుంచి రామ్‌గంజ్ మధ్య మూడవ దశ ట్రయల్, నాలుగవ-అయిదవ దశ ట్రయల్ కూడా ఈ స్టేషన్ల మద్య డౌన్‌లైన్‌లో చేపట్టారు. ట్రయల్ రన్ నిర్వహిస్తున్న సమయంలో అనేక ప్రదేశాల్లో రైలు గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని టచ్ చేసినట్లు మంత్రి తెలిపారు. వందేభారత్ రైలును పూర్తిగా ఇండియాలోనే తయారీ చేస్తున్నారు. దీన్ని సెమీ హై స్పీడ్ ట్రైన్‌గా పిలుస్తున్నారు. వందేభారత్‌కు ప్రత్యేక ఇంజిన్ ఉండదు.