ఆర్థికాంశాల గురించి ఆన్లైన్ కోర్సులు అందించే స్టార్టప్ ‘విస్డమ్ హాచ్’ సంస్థ వ్యవస్థాపకుడు అక్షత్ శ్రీవాత్సవ ఇటీవల చేసిన ఓ ట్వీట్ (ఎక్స్) సోషల్ మీడియాలో చర్చనీయాంశమవుతున్నది. అమెరికా డాలర్ అతి ముద్రణ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రూపురేఖలను ఎలా మారుస్తున్నదనే విషయాన్ని ఆయన అందులో వివరించారు. అంతేకాదు, భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై దాని ప్రభావాన్ని ఆయన నొక్కిచెప్పారు.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న యూఎస్ డాలర్లలో సుమారు 60 శాతం వరకు గత ఐదేండ్లలోనే ముద్రితమయ్యాయని శ్రీవాత్సవ స్పష్టం చేశారు. ఇంత భారీస్థాయిలో కరెన్సీ ముద్రించినప్పటికీ, అమెరికా డాలర్ విలువ ఏ మాత్రం పడిపోలేదని, అందుకు విరుద్ధంగా భారత కరెన్సీ రూపాయి విలువ భారీగా పతనమైందని ఆయన విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించారు. గత ఐదేండ్లలో రూపాయి విలువ 20 శాతం కంటే ఎక్కువే పడిపోయినట్టు ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే, తొలుత ఈ వాదనను చూసినప్పుడు అసంబద్ధంగా అనిపించవచ్చు. ట్రిలియన్ల కొద్దీ డాలర్లు ముద్రించినందున బలహీనమైన కరెన్సీలతో పోలిస్తే డాలర్ విలువ పడిపోతుందని అందరూ అనుకోవచ్చు. కానీ, అమెరికా తెలివిగా ద్రవ్యోల్బణాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి చేస్తున్నదని, రూపాయి వంటి బలహీనమైన కరెన్సీలపై అది తీవ్ర ప్రభావం చూపుతున్నదని శ్రీవాత్సవ వివరించారు. ‘డాలర్లను అమెరికా ప్రభుత్వం ఎక్కువగా ముద్రించినప్పుడు ఫియట్ కరెన్సీలు విలువను కోల్పోతాయి. ఈ క్రమంలో బలహీనమైనవి వేగంగా పతనమవుతాయి. కాబట్టి, యూఎస్ డాలర్ కంటే వేగంగా రూపాయి విలువను కోల్పోతున్నది’ అని శ్రీవాత్సవ వివరించారు.
గ్లోబల్ ఫైనాన్స్‌లో నూతన అధ్యాయం రానున్నదని శ్రీవాత్సవ జోస్యం చెప్పారు. రాబోయే రోజుల్లో అమెరికా మద్దతు ఉన్న స్టేబుల్ కాయిన్లు (క్రిప్టో కరెన్సీ వంటివి) పుట్టుకురావచ్చని ఆయన హెచ్చరించారు. బ్లాక్‌చెయిన్ ఆధారిత స్టేబుల్ కాయిన్‌కు డాలర్‌ను అమెరికా అనుసంధానించవచ్చని, తద్వారా భారత్ వంటి దేశాలకు ద్రవ్యోల్బణాన్ని మరింత వేగంగా ఎగుమతి చేసే ఆస్కారముందని శ్రీవాత్సవ చెప్పారు.
ప్రస్తుతం చెలామణిలో ఉన్న యూఎస్ డాలర్లలో దాదాపు 70 శాతం అమెరికాలో, మిగతా 30 శాతం విదేశాల్లో ఉన్నాయి. స్టేబుల్ కాయిన్లతో అనుసంధానం ద్వారా ఈ నిష్పత్తి వేగంగా మారవచ్చు. భారత్ లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో తీవ్రమైన ద్రవ్యోల్బణానికి ఈ పరిణామాలు దారితీస్తాయని శ్రీవాత్సవ వాదించారు. ఈ నేపథ్యంలో ద్రవ్యోల్బణం ప్రభావం చూపని స్టాక్‌లు, లేదా పరిమిత స్టాక్లను కలిగి ఉండాలని పెట్టుబడిదారులకు ఆయన సూచించారు.
సోషల్ మీడియాలో శ్రీవాత్సవ ట్వీట్ వైరల్ అయ్యింది. దీనిపై చాలా మంది నెటిజన్లు స్పందించారు. ఒక యూజర్ శ్రీవాత్సవ విశ్లేషణను ప్రశంసించారు. ‘డాలర్ బలం దాని ముద్రణ మీద కాదు; నమ్మకం, డిమాండ్ మీద ఆధారపడి ఉంటుంది. ప్రపంచం వాణిజ్యం డాలర్లలో జరిగినంత కాలం, రుణాలను డాలర్లలో చెల్లించినన్ని రోజులు బలహీనమైన కరెన్సీలు ప్రభావితమవుతూనే ఉంటాయి. భారాన్ని భరిస్తూనే ఉంటాయి. ఒకవేళ ఇదే నిజమైతే, స్టేబుల్ కాయిన్లు డాలర్‌కు ఉన్న సరిహద్దులను చెరిపేస్తాయి. డాలర్ లభ్యత, దాని ద్వారా జరిగే వాణిజ్యాన్ని మరింతగా పెంచుతాయి. తద్వారా ఈ ప్రభావం వేగం పుంజుకోవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో ద్రవ్యోల్బణం ప్రభావం చూపని ఉత్పాదక ఆస్తులను కలిగి ఉండటమే మనకు శ్రేయస్కరం’ అని పేర్కొన్నారు. రాబోయే గ్లోబల్ రీసెట్ గురించి మరో నెటిజన్ హెచ్చరించారు. ‘అంతర్జాతీయ వాణిజ్యం, చెల్లింపులు డాలర్లో జరుగుతున్నంత వరకు డాలర్‌ను ఎలాంటి ఆందోళన లేకుండా అమెరికా ముద్రిస్తూనే ఉంటుంది. కానీ, గ్రేట్ రీసెట్ ఊహించిన దానికంటే వేగంగా వస్తున్నది. చివరికి డాలర్ విలువ కూడా పడిపోతుంది. అప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫియట్ కరెన్సీలు డాలర్‌తో పాటు చిత్తుకాగితాలుగా మారిపోతాయి’ అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ‘డాలర్ ఆధిపత్యం అస్థిరమైనదా, లేక ప్రపంచం ఒక ఆర్థిక రీసెట్ వైపు అడుగులు వేస్తున్నదా?’ అని శ్రీవాత్సవ విశ్లేషణపై ఆర్థిక వర్గాల్లో లోతైన చర్చ జరుగుతున్నది.
– ఎడిటోరియల్ డెస్క్
(‘బిజినెస్ టుడే’ సౌజన్యంతో..)