న్యూఢిల్లీ, ఆగస్టు 28: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్)లకు కేంద్ర ప్రభుత్వం బుధవారం తాత్కాలిక చైర్మన్లను ప్రకటించింది. ఈ సంస్థలకు పూర్తిస్థాయిలో చైర్మన్లను నియమించే ప్రక్రియ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ మధ్యంతర నిర్ణయం తీసుకున్నది. కాగా, ఐవోసీ మార్కెటింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సతీశ్ కుమార్ వడుగూరిని ఆ సంస్థ తాత్కాలిక చైర్మన్‌గా నియమిస్తూ కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
అలాగే హెచ్‌పీసీఎల్ ఫైనాన్స్ డైరెక్టర్‌గా ఉన్న రజ్నీశ్ నారంగ్‌ను ఆ కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా నియమిస్తూ ఆర్డర్ ఇచ్చింది. సెప్టెంబర్ 1 నుంచి మూడు నెలలపాటు వీరిరువురు ఈ పదవుల్లో ఉండనున్నారు. ఈ నెలాఖరున ఐవోసీ చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య, హెచ్‌పీసీఎల్ చైర్మన్ పుష్ప కుమార్ జోషి పదవీ విరమణ పొందుతున్నారు. ఈ క్రమంలోనే వారి స్థానంలో సతీశ్, రజ్నీశ్లను తీసుకొస్తున్నారు.