e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home News ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌ రాజీనామా

ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌ రాజీనామా

  • ఉత్తరాఖండ్‌లో కీలక పరిణామం
  • వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు 
  • సీఎంపై పార్టీలో, ప్రజల్లో అసంతృప్తి 
  • వైదొలగాలని బీజేపీ అధిష్ఠానం ఆదేశం 
  • నేడు కొత్త ముఖ్యమంత్రి ఎన్నిక
ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌ రాజీనామా

డెహ్రాడూన్‌, మార్చి 9: వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న హిమాలయ రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యమంత్రిగా మరో పది రోజుల్లో నాలుగేండ్లు పూర్తి చేసుకోనున్న త్రివేంద్ర సింగ్‌ రావత్‌ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. సాయంత్రం రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ బేబీ రాణి మౌర్యకు రాజీనామా లేఖను సమర్పించారు. రాజీనామాను ఆమోదించిన గవర్నర్‌.. తదుపరి ముఖ్యమంత్రిని ఎన్నుకునేంత వరకు ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని రావత్‌ను కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకు బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరుగనున్నది. ఈ భేటీలో పార్టీ ఎమ్మెల్యేలు కొత్త సీఎంను ఎన్నుకోనున్నారు. మంత్రి ధన్‌సింగ్‌ రావత్‌ ముఖ్యమంత్రి రేసులో ముందున్నారు. బీజేపీ సీనియర్‌ నాయకులు, పార్లమెంట్‌ సభ్యులు అజయ్‌భట్‌, అనిల్‌ బలూని పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. మరోవైపు, కుమాన్‌ ప్రాంతం నుంచి ఒకరిని డిప్యూటీ సీఎంగా నియమించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి. పుష్కర్‌సింగ్‌ను ఆ పదవి వరించవచ్చని సమాచారం. రాష్ట్రంలో ఎన్డీ తివారీ (కాంగ్రెస్‌) మినహా ఏ సీఎం ఐదేండ్ల పదవీ కాలాన్ని పూర్తిచేసుకోలేదు. 

రావత్‌ పనితీరుపై అసంతృప్తి..

సీఎం రావత్‌పై సొంత పార్టీ ఎమ్మెల్యేలే కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. తమను పరిగణనలోకి తీసుకోవట్లేదని, అధికారులు కూడా తమ మాట వినట్లేదని వారు విమర్శిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రావత్‌ సారథ్యంలో బరిలోకి దిగితే పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం కష్టమేనని వారు హైకమాండ్‌కు స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో  కేంద్ర నాయకత్వం శనివారం పార్టీ సీనియర్‌ నేతలను రాష్ర్టానికి పరిశీలకులుగా పంపింది. ముఖ్యనేతలతో భేటీ అయిన వారు.. నాయకత్వ మార్పుపై అధిష్టానానికి నివేదికిచ్చారు.

జార్ఖండ్‌ గుణపాఠంతో నిర్ణయం?

తాము నియమించిన ముఖ్యమంత్రులపై రాష్ట్ర నేతల ఫిర్యాదులను బీజేపీ అధిష్ఠానం సహజంగా పట్టించుకోదనే అభిప్రాయం ఉన్నది. అయితే జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పరాజయంతో అధినాయకత్వం వైఖరిలో మార్పు వచ్చినట్టు కనిపిస్తున్నది. అందుకే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరాఖండ్‌లో పార్టీ ఎమ్మెల్యేల ఫిర్యాదులను సీరియస్‌ తీసుకుని, సీఎం రావత్‌పై వేటు వేసినట్టు విశ్లేషకులు చెప్తున్నారు. రావత్‌ స్థానంలో ఠాకూర్‌ సామాజిక వర్గానికే చెందిన మరో వ్యక్తిని సీఎంగా నియమిస్తారని భావిస్తున్నారు. ఆ వర్గానికి చెందిన ధన్‌సింగ్‌ రావత్‌, సత్పాల్‌ మహారాజ్‌ రేసులో ముందున్నారు. 

ఇది పార్టీ సమిష్టి నిర్ణయం: రావత్‌

రాజీనామ అనంతరం సీఎం రావత్‌ మీడియాతో మాట్లాడారు. ‘చాలా కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నా. దేవభూమి ఉత్తరాఖండ్‌కు సేవచేసే సువర్ణావకాశం నాకు దక్కింది. నా తండ్రి సైనికుడు. మాది చిన్న గ్రామం. కింది స్థాయి నుంచి వచ్చిన కార్యకర్తకు కూడా ఇలాంటి గొప్ప అవకాశం లభించడం బీజేపీతోనే సాధ్యం. అయితే ఈ అవకాశం మరొకరికి ఇవ్వాలని పార్టీ సమిష్టిగా నిర్ణయించింది. బాధ్యతలు ఎవరికి అప్పగించినా.. నా పూర్తి సహకారం అందిస్తా’ అని ఆయన పేర్కొన్నారు. 

Advertisement
ఉత్తరాఖండ్‌ సీఎం రావత్‌ రాజీనామా
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement