లక్నో: ఒక మహిళ బ్రెయిన్ డెడ్ అయినట్లు ప్రైవేట్ ఆసుపత్రి ప్రకటించింది. కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో ఇంటికి తరలిస్తుండగా మార్గమధ్యలో గుంతలో పడటంతో భారీ కుదుపులకు గురైంది. దీంతో బ్రెయిన్ డెడ్‌గా పేర్కొన్న ఆ మహిళలో చలనం వచ్చి బతికింది. (brain-dead woman comes to life) ఉత్తరప్రదేశ్‌లోని పిలిభిత్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జిల్లా కోర్టులో హెడ్ కాపీయిస్ట్‌గా పనిచేస్తున్న వినీతా శుక్లా తన ఇంట్లో అనారోగ్యానికి గురైంది. భర్త కుల్దీప్ శుక్లా ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. ఆ మహిళ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో బరేలీ ఆసుపత్రికి రిఫర్ చేశారు.
కాగా, బరేలీలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వినీతను చేర్చారు. ఆమెకు వెంటిలేటర్‌పై చికిత్స అందించారు. ఆ తర్వాత వినీత బ్రెయిన్ డెడ్ అయ్యిందని డాక్టర్లు తెలిపారు. ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబానికి సలహా ఇచ్చారు. ఈ సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు అంత్యక్రియల కోసం ఇంటి వద్ద ఏర్పాట్లలో మునిగిపోయారు.
మరోవైపు బ్రెయిన్ డెడ్‌గా పేర్కొన్న భార్య వినీతను భర్త కుల్దీప్ శుక్లా అంబులెన్స్‌లో పిలిభిత్‌లోని ఇంటికి తరలిస్తున్నాడు. బరేలీలోని హఫీజ్‌గంజ్ సమీపంలో రోడ్డుపై ఉన్న గుంతలోకి అంబులెన్స్ టైర్ వెళ్లింది. ఆ వాహనం భారీ కుదుపులకు గురైంది. దీంతో అంబులెన్స్‌లో ఉన్న వారంతా తమ సీట్ల నుంచి ఎగిరిపడ్డారు.
అయితే అంబులెన్స్‌లో తరలిస్తున్న వినీత శరీరంలో కదలిక కనిపించింది. దీంతో భర్త, కుటుంబ సభ్యులు ఆశ్చర్యపోయారు. వెంటనే ఫిలిభిత్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు.
కాగా, వినీత పాటు కాటు వల్ల అనారోగ్యం చెందినట్లు అక్కడి డాక్టర్లు అనుమానించారు. విష విరుగుడుకు చికిత్స అందించగా ఆమె క్రమంగా కోలుకున్నది. ఆరోగ్యం మెరుగుపడటంతో వినీతను ఇంటికి తీసుకెళ్లారు. లక్నోలోని న్యూరాలజీ నిపుణులకు కూడా చూపించారు. ఆ తర్వాత వినీత పూర్తిగా కోలుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అయితే బ్రెయిన్ డెడ్‌గా పేర్కొన్న ఆ మహిళ అంబులెన్స్ కుదుపు వల్ల తిరిగి బతికినట్లు తెలిసి అంతా ఆశ్చర్యపోయారు.
Also Read:
Woman Poisons Daughter | విషమిచ్చి కుమార్తెను చంపిన తల్లి.. ప్రియుడిని ఇరికించేందుకు యత్నం
Watch: ప్రియుడ్ని విడుదల చేయాలంటూ మొబైల్ టవర్ ఎక్కిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?