బద్వాన్: ఉత్తరప్రదేశ్‌లోని బద్వాన్ జిల్లా కోర్టు ఇవాళ సంచలన తీర్పును వెలువరించింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి మరణశిక్షను విధించింది. 2017లో జరిగిన ఓ మర్డర్ కేసు విషయంలో కోర్టు ఆ తీర్పును ఇచ్చింది. జిల్లా జడ్జి పంకజ్ అగర్వాల్ ఈ తీర్పును వెలువరించారు. కృష్ణపాల్, ఆయన భార్య జల్ధారా, వారి ఇద్దరి కుమారులు విజయ్‌పాల్, రామ్వీర్లకు ఈ శిక్షను ఖరారు చేశారు. ప్రాసిక్యూటర్ అనిల్ కుమార్ సింగ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. ఉరెయినా గ్రామానికి చెందిన పప్పూ సింగ్ అనే వ్యక్తి 2017, మే14వ తేదీన కేసు నమోదు చేశారు. 24 ఏళ్ల కుమారుడు గోవింద్‌ను కృష్ణపాల్ కుటుంబం హత్య చేసినట్లు పప్పూ సింగ్ ఆరోపించారు. కృష్ణపాల్ కుమార్తె 22 ఏళ్ల ఆషా, గోవింద్‌లు లవ్ చేసుకున్నారు. అయితే కృష్ణపాల్ కుటుంబానికి ఆ అఫైర్ నచ్చలేదు. కానీ ఢిల్లీలో ఉంటున్న ఆ జంటకు పెళ్లి చేస్తామని ఇంటికి రప్పించిన కృష్ణపాల్.. ఆ తర్వాత గోవింద్‌ను గొడ్డలితో తలపై కొట్టి చంపాడు. గోవింద్‌ను రక్షించేందుకు ప్రయత్నించిన ఆషాను కృష్ణపాల్ ఫ్యామిలీ అటాక్ చేసింది. ఆ పెనుగులాటలో ఆషా చనిపోయింది. ఇద్దరి శవాలను తరలిస్తున్న దృశ్యాలను స్థానికులు గమనించారు. ఈ కేసులో పోలీసులు నలుగుర్ని అరెస్టు చేశారు.