హైదరాబాద్, జూలై29 (నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ), ఇంజినీరింగ్ నిపుణుల సూచనలు, నివేదికల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటామ ని సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం మాట్లాడారు. మే డిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణే ప్రభుత్వ లక్ష్యమని, ఎన్డీఎస్ఏ నివేదిక ఆధారంగానే ప్రస్తుతం బరాజ్‌లను వినియోగించడం లేదని తెలిపారు.
ప్రస్తుతం నిపుణుల సిఫార్సుల మేరకు శాశ్వత పునరుద్ధరణ చర్యలు తీసుకొంటామని చెప్పారు. దేవాదుల, ఎస్ఎల్బీసీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, సుప్రీంకోర్టు నిర్ణయంతో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులకు ఊరట లభించిందని వెల్లడించారు.
ఢిల్లీలోని కర్ణాటక భవన్లో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేకంగా కలిశారు. కర్ణాటక, తెలంగాణ మధ్య అంతర్రాష్ట్ర నదీజలా ల అంశాలపై వారు చర్చించారు. తుంగభద్ర, కృష్ణ నదీజలాల వినియోగంపై ముచ్చటించారు. మంత్రి ఉత్తమ్ వెంట టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ తదితరులు ఉన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల అంశంపై శుక్రవారం ఢిల్లీలో ఎన్డీఎస్ఏ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. ఈ మేర కు ఇప్పటికే సమాచారం అందించింది.