US-Iran : అమెరికా–ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రెండు దేశాలు 60 రోజులపాటు ప్రాథమిక అవగాహనా ఒప్పందం (ఎంవోయూ)కు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ పొడిగించాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. అలాగే, హార్ముజ్ జలసంధిని తెరవాలని కూడా నిర్ణయించాయి. రెండు దేశాల మధ్య ప్రధాన అడ్డంకిగా ఉన్న అణ్వాయుధ కార్యక్రమంపై కూడా ఒక అవగాహనకు వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం ఈ అంశాలన్నీ ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. వీటికి రెండు దేశాలు అంగీకారం తెలపాల్సి ఉంది. ఈ ఒప్పందం కుదిరితే గల్ఫ్‌లో శాంతి భద్రతలు నెలకొంటాయి. రెండు దేశాల మధ్య పూర్తిస్థాయి ద్వైపాక్షిక చర్చలకు అవకాశం ఉంటుంది. ఇరాన్ యుద్ధం ప్రారంభమై మూడు నెలలు పూర్తైంది. నాలుగో నెలలోకి అడుగుపెట్టబోతుంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్‌తో చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని అమెరికా అధికారులు తెలిపారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ ఇరాన్‌తో చర్చలు విశ్వాసంతో సాగుతున్నాయన్నారు. ఇతర సాంకేతిక అంశాలతోపాటు శుద్ధి చేసిన యురేనియంపై కూడా చర్చలు సాగుతున్నాయని జేడీ వాన్స్ వెల్లడించారు.
తుది చర్చలు విఫలమైతే సైనిక చర్య తీసుకునే అవకాశం కూడా ఉందన్నారు. ఒకపక్క శాంతి చర్చలు సాగుతుంటే, మరోపక్క ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అమెరికా విమానాలు ఇరాన్‌పై దాడి చేస్తుండటంతో ఒక అమెరికన్ విమానాన్ని పేల్చి వేశామని ఇరాన్ ప్రకటించింది. ఇంకా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.