VISA | న్యూఢిల్లీ : ఏదో ఒక నెపం మోపి భారత్ సహా విదేశీ విద్యార్థులను దేశం నుంచి వెళ్లగొడుతున్న అమెరికా తాజాగా మరో వార్నింగ్ ఇచ్చింది. అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులు (భారత్ సహా) కాలేజీ మానేసినా, విద్యాసంస్థకు చెప్పకుండా స్టడీ ప్రోగ్రామ్ నుంచి వెళ్లిపోయినా.. వారి వీసాలు రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు న్యూఢిల్లీలోని అమెరికా ఎంబసీ ఒక ప్రకటన చేసింది. అమెరికాలో చదువుకొనేందుకు వచ్చిన విదేశీ విద్యార్థులందరూ తమ విద్యార్థి వీసా నిబంధనలకు కట్టుబడి ఉండాలని, ఎటువంటి సమస్యలను ఎదుర్కొనకుండా ఉండాలంటే విద్యార్థి హోదాను కొనసాగించాలని స్పష్టం చేసింది. ‘విద్యా సంస్థ నుంచి డ్రాపౌట్ అయినా, క్లాస్‌లకు గైర్హాజరైనా, స్టడీ ప్రోగ్రామ్ నుంచి వైదొలగినా మీ విద్యార్థి వీసాను రద్దు చేస్తాం. అంతే కాదు భవిష్యత్తులో అమెరికా వీసాలు పొందే అర్హతను కూడా కోల్పోయే అవకాశం ఉంది. కాబట్టి అమెరికాలో ఉన్నంత కాలం మీ వీసా నిబంధనలకు కట్టుబడి ఉండండి’ అని ఆ ప్రకటనలో తేల్చి చెప్పింది.
విదేశాల్లో చదువుకోవాలనుకొనే భారతీయ విద్యార్థులు తమ మొదటి ప్రాధాన్యాన్ని ఎక్కువగా అమెరికన్ యూనివర్సిటీలకే ఇస్తుంటారు. వరుసగా మూడుసంవత్సరాలపాటు అమెరికా నుంచి అత్యధికంగా విద్యార్థి వీసాలు పొందిన దేశంగా భారత్ నిలిచింది.
పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న వారిని, ఆ ఆందోళనలకు పరోక్షంగా మద్దతిచ్చిన వారిని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్ట్‌లను షేర్ చేసిన వారిని సైతం ట్రంప్ సర్కారు వీసాలు రద్దు చేసి ఇంటికి పంపించింది. చిన్నచిన్న ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని సైతం వీసాలు రద్దుచేసి స్వదేశాలకు పంపించివేసింది.
ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించి ట్రంప్ యంత్రాంగం చేసిన ప్రకటన ఆ విశ్వవిద్యాలయంలో చదువుకొంటున్న విదేశీ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. హార్వర్డ్ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులకు ప్రవేశాలు కల్పించే అర్హతను ట్రంప్ ప్రభుత్వం ఈ నెల 22న రద్దు చేసింది. అయితే కోర్ట్ ఈ నిర్ణయాన్ని నిలిపేసింది.
కొత్త విద్యార్థులకు వీసాలు జారీ చేసేందుకు నిర్వహించే ఇంటర్వ్యూ ప్రక్రియను నిలిపివేయాలని అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. యూఎస్‌లో విద్యనభ్యసించడానికి విదేశీ విద్యార్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో వారి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని భావించిన ట్రంప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. తమ దేశానికి వచ్చే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను పూర్తిగా పరిశీలిస్తామని అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే ప్రకటించారు.