న్యూఢిల్లీ, అక్టోబర్ 2: పశ్చిమాసియాలో అమెరికా తన సైనిక ప్రాబల్యాన్ని మరింత పెంచింది. సుమారు 9,000 మంది అదనపు సైనికులతోపాటు తన మూడవ విమాన వాహక నౌక యూఎస్ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్‌ను కూడా ఆ ప్రాంతానికి పంపుతున్నది. అక్టోబర్ చివరి నాటికి పశ్చిమాసియాలో అమెరికాకు చెందిన మూడు విమాన వాహక నౌకలు మోహరించి ఉంటాయి. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌పై దాడులు ప్రారంభిస్తామని ట్రంప్ గతంలో పేర్కొన్నారు.
పశ్చిమాసియాకు అమెరికా పంపుతున్న కొత్త నౌకాదళ బలగంలో యూఎస్ఎస్ థియోడర్ రూజ్‌వెల్ట్‌తోపాటు యూఎస్ఎస్ మాకిన్ ఐలాండ్, ఇతర యుద్ధనౌకలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అవి ఆ ప్రాంతం వైపు పయనిస్తున్నాయి. థియోడర్ రూజ్వెల్ట్ ఆగమనంతో ఆ ప్రాంతంలో మళ్లీ మూడు అమెరికా విమాన వాహక నౌకలు ఉండనున్నాయి. మూడు విమాన వాహక నౌకలను అమెరికా మోహరించడం 2003 నుంచి ఇదే మొదటిసారి.