దేశాల నమ్మకం కోల్పోతున్న ఐరాస
రెండవ ప్రపంచయుద్ధం నేర్పిన గుణపాఠాలను పునాదులుగా చేసుకొని 1945 జూన్ 26న 51 దేశాలు తీసుకున్న నిర్ణయంతో 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి (ఐరాస) అనివార్యంగా ఏర్పడింది. ‘యునైటెడ్ నేషన్స్' అనే పదాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ రూపొందించారు. అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఐరాసలో నేడు 193 (రెండు పరిశీలన దేశాలుగా ఉండగా) దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి.
రెండవ ప్రపంచయుద్ధం నేర్పిన గుణపాఠాలను పునాదులుగా చేసుకొని 1945 జూన్ 26న 51 దేశాలు తీసుకున్న నిర్ణయంతో 1945 అక్టోబర్ 24న ఐక్యరాజ్యసమితి (ఐరాస) అనివార్యంగా ఏర్పడింది. ‘యునైటెడ్ నేషన్స్’ అనే పదాన్ని అప్పటి అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ రూపొందించారు. అమెరికాలోని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ప్రారంభమైన ఐరాసలో నేడు 193 (రెండు పరిశీలన దేశాలుగా ఉండగా) దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. స్వతంత్ర దేశాలుగా గుర్తింపు పొందని నార్త్ సైప్రస్, సొమాలిల్యాండ్ అబ్కాజియా లాంటి రాజ్యాలకు ఐరాస సభ్యత్వం ఇవ్వలేదు. వాటికన్ సిటీ, పాలస్తీనా సభ్యత్వాన్ని పొందలేదు. గత 80 ఏండ్లుగా ప్రపంచ దేశాల మధ్య విభేదాలను పరిష్కరించే తటస్థ వేదిక రూపంలో మధ్యవర్తిత్వం వహిస్తూ, పలు వివాదాల పరిష్కారానికి నిర్విరామ కృషి చేస్తూ, కరోనా లాంటి విపత్తు జరిగినపుడు ప్రజలను చైతన్య పరిచే ఐక్యరాజ్యసమితి ఎనిమిది దశాబ్దాల వ్యవస్థాపక వేడుకలు చేసుకుని శతాబ్ది ఉత్సవాల స్థాయికి ఎదగడానికి ఉవ్విళ్లూరుతూ మానవళికి సేవలు అందించడం సంతోషదాయకం. అయితే ఇటీవలి కాలంలో క్రమంగా ప్రపంచ ప్రజల ఐరాస విశ్వాసం కోల్పోతున్నది.
(నేడు ఐరాస ఆవిర్భావ దినోత్సవం)
ఐరాస జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం ఏటా అక్టోబర్ 24న సభ్యదేశాలు ఐక్యరాజ్యసమితి దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తూ ఉంటాయి. ఈ ఏడాది ఐరాస దినోత్సవం సందర్భంగా అందరికీ నమ్మకంతో కూడిన సకారాత్మక మార్పులను తీసుకురావడం అనే అంశాన్ని ఐరాస సర్వసభ్య సమావేశం ఇతివృత్తంగా నిర్ణయించింది. ప్రపం చ మానవాళిని విపత్తులు, భీకర యుద్ధాలు, వాతావరణ ప్రతికూల మార్పులు కల్లోల పరుస్తున్న వేళ, దేశాలన్నీ ఆర్థిక, సామాజిక, ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న అకాలంలో ఐరాస 81వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకోవలసి వస్తున్నది. అత్యవసర సమయాల్లో సత్వరమే స్పందిస్తూ, ప్రపంచ దేశాలకు తగిన పరిష్కారాలను సూచిస్తూ, ప్రపంచశాంతి స్థాపన యజ్ఞంలో తన వంతు బాధ్యతలను నిర్వహిస్తున్న ఐరాస ప్రశంసలు అందుకుంటున్నది. కానీ ప్రస్తుతం కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా, ఇజ్రాయెల్ – పాలస్తీనా, అమెరికా – ఇరాన్ యుద్ధాలకు మధ్యవర్తిత్వానికి దూరంగా ఉంటూ, వాటిని అదుపు చేయడంలో విఫలం కావడంతో నేడు ఐరాస పేపర్ టైగర్‌గా కనిపిస్తున్నదని, సంస్థ ఉనికి ప్రశ్నార్థకంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఐరాస ప్రధాన విభాగాలు
ఐరాస అధికార భాషలుగా అరబిక్, చైనీస్, ఇంగ్లిష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్ గుర్తింపు పొందాయి. ఐరాసలో ముఖ్యమైన 6 విభాగాల్లో జనరల్ అసెంబ్లీ, సెక్యూరిటీ కౌన్సిల్, ఎకనమిక్ అండ్ సోషల్ కౌన్సిల్, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, సెక్రటేరియట్, ట్రస్టీషిప్ కౌన్సిల్ (క్రియాశీలంగా లేదు) ఉన్నాయి. ఐరాస ప్రధాన విధుల్లో భాగంగా అంతర్జాతీయ శాంతి, భద్రతల స్థాపన, దేశాల మధ్య స్నేహబంధాలను నెలకొల్పుతున్నది. దేశాల మధ్య నెలకొన్న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, మానవీయ సమస్యకు పరిష్కారాలు చూపుతూ, మానవహక్కులను కాపాడుతూ మౌలిక స్వేచ్ఛను కల్పిస్తున్నది. విపత్తులు, యుద్ధాలు విజృంభించిన సమయంలో ప్రజలను జాగృతపర్చడం, పర్యావరణ కాలుష్య నియంత్రణ, భూగోళాన్ని పరిరక్షించడం లాంటి అతి ముఖ్యమైన అంశాల్లో ప్రపంచ దేశాలను చైతన్యపరుస్తున్నది. దేశాల మధ్య సమానత్వం, నమ్మకాలను గౌరవించడం, దేశ అంతర్గత సమస్యలకు దూరంగా ఉండడం, సరిహద్దు వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం లాంటి సూత్రాల ఆధారంగా ఐరాస పని చేస్తున్నది. ఐరాసకు అవసరమైన నిధులను సభ్యదేశాలే అందిస్తాయి. ఐరాసలో ముఖ్య ఏజెన్సీలుగా యునిసెఫ్, ఐఎల్వో, ఎఫ్ఏవో, డబ్ల్యూహెచ్‌వో, ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి 15 ఏజెన్సీలు తమ తమ విధులను నిర్వహిస్తున్నాయి.
అంతర్జాతీయ శాంతి స్థాపనలో ప్రధాన పాత్ర పోషిస్తున్న యూఎన్వో భద్రతా మండలి (సెక్యూరిటీ కౌన్సిల్)లో ఐదు అగ్రరాజ్యాలు అమెరికా, రష్యా, యూకె, ఫ్రాన్స్, చైనా శాశ్వత సభ్యులుగా వీటో పవర్ కలిగి ఉన్నాయి. భద్రతా మండలిలో మరో 10 దేశాలకు 2 ఏండ్ల వ్యవధితో తాత్కాలిక వీటో లేని సభ్యత్వాన్ని కల్పిస్తారు. ఇండియా తాత్కాలిక సభ్యత్వ దేశంగా సేవలందించింది. ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్ ముఖ్య పరిపాలనాధికారి (సీఏవో)గా సేవలందిస్తున్నారు. ఐరాస నిర్దేశిత నియమాలను తీవ్రంగా ఉల్లంఘించిన దేశ సభ్యత్వాన్ని భద్రతా మండలి సిఫారసుతో జనరల్ అసెంబ్లీ రద్దు కూడా చేయవచ్చు. ప్రపంచ దేశాల్లో 145 కోట్ల జనాభాతో కూడిన ఓ ప్రధానమైన దేశంగా భారత్‌కు భద్రతామండలిలో చోటు దక్కకపోవడం, చైనా లాంటి దేశాలు అడ్డుపుల్లలు వేయడం విస్మయాన్ని కలిగిస్తున్నది.
మైలురాళ్లు, అడ్డంకులు దాటుకుంటూ!
ఆవిర్భావం నుంచి నేటి వరకు ఐరాస నిర్వహించిన పాత్ర ప్రశంసనీయంగా ఉంటూనే కొన్ని సందర్భాల్లో నిరాశనే మిగిల్చింది. అనేక ఆటంకాలు, సవాళ్ల నడుమ తన ఉనికిని చాటుకుంటూ, ప్రపంచదేశాల్లో శాంతి స్థాపన దిశగా అడుగులు వేస్తున్నది. ఐరాస చరిత్రలో ఎన్ని మైలురాళ్లు దాటినా, కొన్ని విషమ పరిస్థితుల్లో తగిన న్యాయం చేయలేకపోయిందనే విమర్శలను మూటకట్టుకున్నది. అమెరికా- ఇరాక్ మధ్య వివాదం, సూడాన్‌లో అకాల మరణాలు, నేడు కొనసాగుతున్న యుద్ధాలకు ముగింపు పలకడం లాంటి సందర్భాల్లో ఐరాస విఫలమైందని తెలుస్తున్నది. ఐరాస ఎదుర్కొంటున్న సవాళ్లలో పేదరికం, అనారోగ్య సమస్యలు, పర్యావరణ కాలుష్యం, దేశాల మధ్య సంఘర్షణలు, మానవ హక్కుల ఉల్లంఘనలు, హింస, ఉగ్రవాదం, వ్యవస్థీకృత నేరాలు, అయు ధ సంపత్తి విస్తరణ లాంటివి ముఖ్యమైనవి. నేడు భీకరంగా జరుగుతున్న యుద్ధాలతోపాటు అమెరికా- చైనా మధ్య నెలకొన్న ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణం ఐరాస లక్ష్యాలను ప్రశ్నార్థకం చేస్తున్నది. అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణులతో ఐరాస కార్యదక్షత అయోమయంలో పడుతున్నది. ఆయుధాలతో అగ్రరాజ్య స్థాయి సాధ్యపడదని, విశ్వమానవాళికి సుఖసంతోషాలు పంచడమే పెద్దరికం అవుతుందని అగ్ర దేశాలు గుర్తించాలి. ప్రపంచశాంతి స్థాపనలో ఐరాస పెద్దన్న మాదిరిగా నిలబడి, దేశాల మధ్య విభేదాలను చెరిపి, అవసరమైతే కొరడా ఝులిపి, సహకార భావనను పెంచి, ప్రపంచ కుగ్రామాన్ని సుందర నివాస ప్రదేశంగా నిర్మించాలని ఆశిద్దాం. ఐరాసను గౌరవిద్దాం, ప్రపంచశాంతికి పునాదులు వేద్దాం.
(వ్యాసకర్త: రిటైర్డ్ ప్రిన్సిపాల్)
డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి 9949700037
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

