ఆర్టీసీ ఎన్నికల్లో సర్కార్ తొండాట!
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సర్కార్ తొండాట ఆడుతున్నది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన కూటమికి అధికారం కట్టబెట్టడం కోసం కుయుక్తులు పన్నుతున్నది. ఇందుకోసం నిబంధనలు సైతం మార్చుతూ ఎన్నికల స్ఫూర్తిని కాలరాస్తున్నది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దీంతో ఉద్యోగ, కార్మిక లోకం భగ్గుమంటున్నది.
ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో సర్కార్ తొండాట ఆడుతున్నది. కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన కూటమికి అధికారం కట్టబెట్టడం కోసం కుయుక్తులు పన్నుతున్నది. ఇందుకోసం నిబంధనలు సైతం మార్చుతూ ఎన్నికల స్ఫూర్తిని కాలరాస్తున్నది. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల తీర్పునకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. దీంతో ఉద్యోగ, కార్మిక లోకం భగ్గుమంటున్నది. గుర్తింపు సంఘ ఎన్నికలు నిర్వహిస్తామని, ప్రభుత్వంలో సంస్థ విలీన ప్రక్రియ పూర్తి చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీ ఆచరణకు నోచుకోలేదు. దీంతో కార్మికులు, ఉద్యోగులు ఏప్రిల్ 22 నుంచి నిరవధిక సమ్మెకు దిగారు. ఉద్యోగుల రెండు ప్రధాన డిమాండ్లు తప్ప మిగతా వాటిపై ముందుగా చర్చిద్దామన్న రవాణా మంత్రి ప్రతిపాదనను తిరస్కరించి సమ్మెను కొనసాగించారు. రెండో రోజున ఓ కార్మికుడు ఆత్మాహుతి చేసుకోవడంతో విషాదం నెలకొన్నది. మూడో రోజున ప్రభుత్వం దిగివచ్చి వారి రెండు ప్రధాన డిమాండ్లకు తలవంచకతప్పలేదు. కానీ సర్కార్ ఇప్పుడు మళ్లీ మోసం చేస్తున్నది.
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేపట్టిన సమ్మె నేపథ్యంలో ఈ నెల 9న ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగాయి. ఇక తాము ప్రభుత్వంలో భాగమైతామని వారు ఆశగా ఉన్నారు. కేసీఆర్ హయాంలోనే 14 సెప్టెంబర్ 2023 నాడు యాక్ట్ – 7 పేరిట విలీన ప్రక్రియకు అవసరమైన ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ప్రస్తుత ప్రభుత్వం కేవలం గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలుపుకోవచ్చు. అలా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ ట్రెజరీ నుంచి జీతాలు చెల్లించవచ్చు. అప్పుడు ఓ కమిటీ వేసి దాని నివేదిక వచ్చిన తర్వాత వారి జీతభత్యాల్లో, ఉద్యోగ భద్రత తదితర అంశాలపై తుది నిర్ణయాలు తీసుకోవచ్చు. అయితే ఎన్నికలు జరిపినట్టు విలీన ప్రక్రియకు ప్రభుత్వం సిద్ధంగా లేదని చెప్పవచ్చు. విలీనం డిమాండ్ చేసే బలమైన ఉద్యోగ సంఘాలను ఎన్నికల స్థాయిలోనే కట్టడి చేయాలని ప్రభుత్వం భావించింది. తమ చెప్పుచేతల్లో ఉండే ఉద్యోగ సంఘానికి గుర్తింపు హోదా రావాలని తీవ్రంగా యత్నించింది.
ఈ దురాలోచన ఎన్నికల బ్యాలెట్ గుర్తుల కేటాయింపు నుంచే మొదలైంది. ఆర్టీసీ ఎన్నికల్లో ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న బాణం గుర్తును కాంగ్రెస్ మద్దతు పొందుతున్న కూటమికి ఇచ్చేలా నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చింది. గుర్తులను తారుమారు చేసి ఓటేసే ఉద్యోగులను తికమకపరచి లబ్ధి పొందాలనుకున్నది. అయినా ఫలితాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే వచ్చా యి. ఈ ఎన్నికల్లో సుమారు 32 వేల మంది ఉ ద్యోగులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.
మొత్తం పోలైన 31,920 ఓట్లలో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి (టీఎంయూ)కు 18,250 రాగా తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ కూటమికి 13,670 ఓట్లు వచ్చాయి. ఓడిపోయిన టీడబ్ల్యూయూకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఓ కూటమికి మద్దతు ఇచ్చి.. దాన్ని ఎలాగోలా గెలిపించి, గెలుపు తమదేనని ప్రజలను నమ్మించే యత్నం కాంగ్రెస్ చేసింది. ఇన్ని పన్నాగాలు పన్నినా ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం ఎప్పుడూ తమకు అండగా ఉండే ఎంప్లాయీస్ యూనియన్‌కే పట్టం కట్టారు.
ఈ ఓటమిని జీర్ణించుకోని కాంగ్రెస్ సర్కార్ కార్మిక శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఎన్నికల్లో పాటిస్తున్న విధానాలను పక్కన పెట్టే ఆలోచన చేసింది. రీజియన్ ఎన్నికల ఫలితాలు తాము మద్దతు ఇచ్చిన కూటమికి కట్టబెట్టేయత్నం చేసింది. అందుకే 17వ తేదీన రావలసిన ఫలితాల ప్రకటన వారం రోజులు ఆలస్యమైంది. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి ఓడిపోయిన టీడబ్ల్యూయూ నేతలు ఓట్ల వివరాలు దాచిపెడుతూ 97 డిపోల్లో 51లో, 14 రీజియన్లలో 9లో తమకే ఆధిక్యత ఉన్నదని, ఉద్యోగుల మద్దతు తమకే ఉన్నదని ప్రకటించారు. గెలుపొందిన ఎంప్లాయీస్ యూనియన్ కూటమి ఫలితాల ప్రకటన కోసం రోడ్డెక్కక తప్పలేదు.
ఆర్టీసీ ఉద్యోగులు రెండు ఓట్లు వేయాలి. ఒకటి ఆర్టీసీ మొత్తానికి గుర్తింపు కోసం, మరొకటి రీజియన్ స్థాయిలో గుర్తింపు కోసం. ఆర్టీసీ మొత్తానికి గుర్తింపుగా ఎంప్లాయీస్ యూనియన్ కూటమి 4,580 ఓట్ల ఆధిక్యతను సాధించింది. ఆర్టీసీలో మొత్తం 14 రీజియన్లు ఉన్నాయి. రీజియన్ స్థాయిలో పోలైన ఓట్లలో ఎవరికి 50 % పైగా ఓట్లు వస్తాయో వారు గెలిచినట్టు లెక్క. ఎవరికీ 50% పైగా ఓట్లు రానట్టయితే అవి సరాసరి సంస్థ స్థాయిలో గెలుపొందిన సంఘానికి చెందుతాయి. ఇదే విధానాన్ని పాటిస్తామని ఎన్నికలు జరిపిన కార్మిక శాఖ అధికారులు ముందే చెప్పారు. దానికి అన్ని సంఘాలు ఆమోదం కూడా తెలిపాయి. ఈ సారి జరిగిన రీజియన్ స్థాయి ఎన్నికల్లో పోలైన ఓట్లలో 50% కంటే కనీసం ఒక ఓటు ఎక్కువ వచ్చినవి ఏడు మాత్రమే ఉన్నాయి. వాటిలో నాలుగు రీజియన్లలో ఎంప్లాయీస్ యూనియన్ కూటమి , మూడు రీజియన్లలో కాంగ్రెస్ బలపర్చిన టీడబ్ల్యూయూ విజయం సాధించాయి. మిగతా రీజియన్లలో ఆ పద్ధతిలో ఓట్లు పడలేదు. ఒప్పందం ప్రకారం ఎవరికీ ఆధిక్యత రాని రీజియన్లు మొదటి ఓటుతో గెలుపొందిన ఎంప్లాయీస్ యూనియన్ కూటమికి చెందుతాయి. అయితే వాటిని కాంగ్రెస్ మద్దతు తెలిపిన కూటమికి దక్కేలా విధానాల మార్పిడి జరిగింది.
50% నిబంధనను పక్కనబెట్టి ఈ రీజియన్లలో ఎక్కువ ఓట్లు వచ్చిన సంఘానికి కట్టబెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యులు చూస్తున్నారు. ఈ మార్పు వల్ల 4 రీజినల్ స్థానాలు అక్రమంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన టీడబ్ల్యూయూ కూటమిలోకి వెళ్లిపోతాయి. చివరకు రాష్ట్రస్థాయి గుర్తింపులో ఓటమి పాలైన కూటమికి రీజియన్లలో మెజారిటీ చేజిక్కుతుంది.
న్యాయంగా తమకు రావలసిన 4 రీజియన్లను ఉద్యోగుల మద్దతులేని సంఘాలకు కట్టబెట్టడాన్ని ఎంప్లాయీస్ కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. రీజియన్ల ఫలితాలపై ఇంకా స్పష్టమైన ప్రకటన బయటకు రాలేదు. ఎన్నికల్లో గెలుపొందిన సంఘానికి రిటర్నింగ్ అధికారి గుర్తింపు పత్రాన్ని అందజేయాలి. దాని ఆధారంగా వారు ప్రభుత్వంతో ఉద్యోగుల తరఫున సంప్రదింపులు జరుపుతారు. ఎన్నికల్లో ఓడిపోయిన టీడబ్ల్యూయూ కూటమితో ఈ నెల 22న మంత్రి చర్చలు జరిపారు. కానీ ఓడిన కూటమితో ఉద్యోగుల సమస్యలు చర్చించడం, హామీ ఇవ్వడం అర్థరహితం. ప్రభుత్వం ఎన్నికల ఫలితాలను గౌరవించి, చర్చల కోసం గుర్తింపు సంఘ ప్రతినిధులను ఆహ్వానించి తన నిజాయితీని నిరూపించుకోవాలి.
బద్రి నర్సన్
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

