హైదరాబాద్, ఫిబ్రవరి 11 : స్విట్జర్లాండ్‌కు చెందిన బహుళజాతి ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్, ఆర్థిక సేవల దిగ్గజం యూబీఎస్.. హైదరాబాద్‌లో ఓ కొత్త గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతులమీదుగా దీన్ని ఆవిష్కరించారు. దీంతో నగరంలో యూబీఎస్ కార్యకలాపాల బలోపేతానికి గొప్ప ముందడుగు పడగా.. భారత్‌లో ఆ సంస్థ దీర్ఘకాలిక నిబద్ధతకూ ఇది అద్దం పడుతున్నది.
ఈ నూతన జీసీసీలో వచ్చే రెండేండ్లకుపైగా కాలంలో దాదాపు 3 వేల మంది నిపుణుల్ని నియమించుకోవాలని ప్రణాళికలు వేస్తున్నట్టు యూబీఎస్ ఓ ప్రకటనలో పేర్కొన్నది. కాగా, ఈ స్టేట్-ఆఫ్-ది-ఆర్ట్ సెంటర్.. అత్యుత్తమ ఆర్థిక సాంకేతికత, కార్యకలాపాలు, జీసీసీలకు గ్లోబల్ హబ్‌గా ఎదుగుతున్న హైదరాబాద్ ప్రతిష్ఠను మరింత ఇనుమడింపజేయగలదన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా యూబీఎస్ వర్గాలు వ్యక్తం చేశాయి.
అంతర్జాతీయంగా ఎంతో పేరొందిన కంపెనీలకు హైదరాబాద్ అత్యంత ప్రాధాన్య నగరంగా నిలుస్తున్నదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అలాగే జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను యూబీఎస్ ఎంచుకోవడం.. గ్లోబల్ టాలెంట్, ఇన్నోవేషన్ హబ్‌గా నగరానికిగల విశ్వసనీయతకు అద్దం పడుతున్నదని తెలిపారు. ఇండియా-ఈయూ-స్విట్జర్లాండ్ కారిడార్ దీర్ఘకాల బలోపేతానికీ ఈ సెంటర్ దోహదం చేయగలదని అభిప్రాయపడ్డారు. ‘హైదరాబాద్.. యూబీఎస్‌కు ఓ ప్రధాన వృద్ధిదాయక కేంద్రంగా కొనసాగుతున్నది. ఇందుకు ఇక్కడి ప్రతిభ, నైపుణ్యాలే కారణం. ప్రోత్సాహకర విధానాలు, అత్యుత్తమ మౌలిక సదుపాయాలకూ మా కృతజ్ఞతలు. మున్ముం దూ నగరంలో మా విస్తరణ ఉంటుంది. ఏఐ తదితర సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేస్తాం’ అని యూబీఎస్ భారతీయ సేవల అధిపతి మత్తియస్ అన్నారు.
అమెరికాకు చెందిన బహుళజాతి టెక్నాలజీ దిగ్గజం ఒరాకిల్.. భారత్‌లో మరిన్ని డాటా సెంటర్లను ఏర్పాటు చేయబోతున్నది. ఇందులోభాగంగానే హైదరాబాద్‌లో ఓ కొత్త డాటా సెంటర్‌ను తీసుకురావాలనుకుంటున్నట్టు సమాచారం. అలాగే దేశ వాణిజ్య రాజధాని నగరం ముంబైలోనూ నూతన డాటా సెంటర్‌ను నెలకొల్పే దిశగా వెళ్తున్నట్టు తెలుస్తున్నది. అన్ని రంగాల్లో ఏఐ, క్లౌడ్ ఆధారిత సేవలకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో డాటా సెంటర్ల సామర్థ్యాన్ని బలోపేతం చేసుకోవాలని ఒరాకిల్ భావిస్తున్నది. ఈ క్రమంలోనే దేశీయ ప్రధాన నగరాల్లో కీలకమైన హైదరాబాద్, ముంబైలలో వ్యూహాత్మక విస్తరణపై సంస్థ దృష్టి సారించిందని చెప్తున్నారు. ఇదిలావుంటే పెరుగుతున్న డాటా సెంటర్ సామర్థ్యం, దాని మల్టీక్లౌడ్ వ్యూహాలు.. కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులకు దన్నుగా నిలుస్తాయన్న ఆశాభావాన్ని ఒరాకిల్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కాగా, తమ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం.. గత 6-7 ఏండ్లుగా భారత్‌లో బహుళ సామర్థ్య అవకాశాల బలోపేతానికి కృషి చేస్తున్నదని ఒరాకిల్ చెప్తున్నది. సమీప భవిష్యత్తులో కంపెనీ వృద్ధిలో భారత్ కీలకపాత్ర పోషించగలదన్న విశ్వాసాన్ని కూడా వెలిబుచ్చుతున్నది.