Iran Oil Tankers : యుద్ధం కారణంగా పశ్చిమాసియా (West Asia) లో కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ ఇరాన్ (Iran) కు చెందిన రెండు చమురు నౌకలు (Crude oil) భారత్ (India) కు చేరుకున్నాయి. దాంతో దాదాపు ఏడేళ్ల తర్వాత ఇరాన్ చమురు భారత దేశానికి వచ్చినట్లయ్యింది. ఈ రెండు నౌకలు గుజరాత్ (Gujarat) లోని సిక్కా పోర్టు (Sikka port) లో లంగరేశాయని షిప్ ట్రాకింగ్ డేటా తెలిపింది. నేషనల్ ఇరానియన్ ట్యాంకర్ కంపెనీకి చెందిన రెండు చమురు నౌకలు మార్చి మధ్యలో ఖర్గ్ ద్వీపం (Kharge Island) నుంచి బయల్దేరాయి. ఇవి దాదాపు రెండు మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును మోసుకొచ్చాయి. అయితే ఈ నౌకలను ఎవరు కొనుగోలు చేశారన్నదానిపై స్పష్టత లేదు.
అగ్రరాజ్యం పెట్టిన ఆంక్షల కారణంగా భారత్ 2019 నుంచి ఇరాన్ చమురు కొనుగోలును నిలిపివేసింది. దాంతో అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్‌కు ఇరాన్ చమురు రవాణా జరగలేదు. ఈ క్రమంలోనే ఇటీవల పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు కొరత ఆందోళనలు వెల్లువెత్తాయి. దాంతో ఇరాన్ చమురుపై ఉన్న ఆంక్షలను అమెరికా సడలించింది. సముద్ర జలాల్లో ఉన్న ఇరాన్ చమురు నౌకలను కొనుగోలు చేసేందుకు అనుమతి ఇచ్చింది. అందులో భాగంగానే ఇరాన్ చమురు నౌకలు ఇప్పుడు భారత్‌కు చేరుకున్నాయి. మరోవైపు అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో హర్మూజ్ జలసంధిని దిగ్బంధించేందుకు అగ్రరాజ్యం సిద్ధమవుతున్నది.
కాగా చమురు దిగుమతి చేసుకునే దేశాల్లో ప్రపంచంలోనే భారత్ మూడో అతి పెద్ద దేశం. ఇంధన కొరత కారణంగా ఇరాన్‌తోపాటు ఇతర దేశాల నుంచి కూడా చమురు కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత్ ఇటీవల ప్రకటించింది.