కౌకుంట్ల(దేవరకద్ర), జూన్ 17: గాలివాన బీభత్సానికి నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి కారుపై పడటంతో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. దేవరకద్రలో బుధవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో చాలాచోట్ల చెట్టుకొమ్మలు, కరెంట్ స్తంభాలు విరిగిపడటంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఎస్బీఐ బ్యాంకు సమీపంలో నిర్మాణంలో ఉన్న రెండు అంతస్తుల భవనం గోడ కూలి పక్కన ఉన్న కారుపై పడింది. దీంతో కారులో ఉన్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. అతికష్టం మీద వారిని బయటకు తీశారు. అనంతరం దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. మృతి చెందిన వారు సివిల్ ఇంజినీర్ జగన్నాథ్‌రెడ్డి, డ్రైవర్ సంతోష్‌గా పోలీసులు గుర్తించారు. అలాగే దేవరకద్ర రైల్వేస్టేషన్లో విద్యుత్తు వైర్లపై చెట్టుకొమ్మలు పడటంతో రైలు కొంతసేపు స్టేషన్లోనే ఆగిపోయింది.