హైదరాబాద్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన తుగ్లక్ ( Tughlaq ) ను తలపించేలా ఉందని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్( Talasani Srinivas Yadav ) ఆరోపించారు. ఆదివారం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద సనత్ నగర్ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్( BRS ) పార్టీ సర్వసభ్య సమావేశం ఎమ్మెల్యే తలసాని అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలోని వివిధ డివిజన్లకు చెందిన నాయకులు మాట్లాడుతూ నూతన డివిజన్ల ఏర్పాటు, డివిజన్ల విభజన అంతా గందరగోళంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ ప్రభుత్వం హరిబరిగా ఓఆర్ఆర్ ( ORR ) లోపల ఉన్న అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లను జీహెచ్ఎంసీ ( GHMC ) లో విలీనం చేసి 150 ఉన్న డివిజన్ లను 300కు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకుండా ఆఫీసులలో కూర్చొని గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా డివిజన్లను ఏర్పాటు చేశారని దుయ్యబట్టారు. రాజకీయ పార్టీలు, ప్రజాప్రతినిధులు, కాలనీలు, బస్తీ ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా డివిజన్ ఏర్పాటు, విభజన చేశారని ధ్వజమెత్తారు. అభ్యంతరాలు తెలియజేయడానికి స్వల్ప సమయం ఇవ్వడం సరికాదని అన్నారు. కనీసం నెల రోజుల గడువు పెట్టి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను తీసుకొని వారి సూచనల మేరకు డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
నూతన డివిజన్ ల పేర్లను కూడా ఇష్టమొచ్చినట్లు కాకుండా స్థానిక ప్రజల విశ్వాసాన్ని పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, ప్రజల నుండి వచ్చే అభ్యంతరాలకు అనుగుణంగా మార్పులు చేయాలని, లేని పక్షంలో న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ హయాంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. రోడ్ల అభివృద్ధి, డ్రైనేజీ, వాటర్ లైన్ల ఏర్పాటు, పార్క్‌ల అభివృద్ధి, మల్టీ పర్ఫస్ ఫంక్షన్ హాల్స్ నిర్మాణం చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు కొలన్ లక్ష్మీ, కుర్మ హేమలత, టి.మహేశ్వరి, మాజీ కార్పొరేటర్లు నామన శేషుకుమారి, అత్తిలి అరుణ గౌడ్, ఆకుల రూప, మల్లిఖార్జున్ గౌడ్, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, అత్తిలి శ్రీనివాస్ గౌడ్, గుర్రం పవన్ కుమార్ గౌడ్, ఆకుల హరికృష్ణ, వెంకటేషన్ రాజు, శ్రీనివాస్ గౌడ్, హన్మంతరావు పాల్గొన్నారు.