AP News | తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థాన (TTD) డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో బుధవారం ఉదయం నుంచి ఏసీబీ అధికారులు చేపట్టిన దాడులు గురువారం ఉదయం ముగిశాయి. వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో పత్రాలు, బంగారం, వెండి, నగదు బయటపడ్డాయి. రూ. 5 కోట్ల విలువ ఆస్తులు, 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ. 12 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అటు టీడీడీ వర్గాలు, ఇటు ప్రజల్లో ఈ కేసు కలకలం రేపింది. అధికారులు లోకనాథంను అరెస్ట్ చేసి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. నేడు నెల్లూరు కోర్టులో అతడిని హాజరుపరచనున్నట్లు సమాచారం.
కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్న అప్పన్న విచారణలో వెల్లడైన విషయాల ఆధారంగా లోకనాథం (Lokanatham)పై కేసు నమోదు చేశారు. ఏసీబీ అధికారుల తనిఖీల్లో వెలుగు చూసిన నగదు, బంగారం, వెండి, ఆస్తుల విలువను లెక్కిస్తున్నారు. వాటికి సంబంధించిన ఆదాయ వనరులపై ఆరా తీస్తున్నారు. వాటికి సంబంధించిన లెక్కలు ఉన్నాయా లేదా అక్రమంగా సంపాదించిందా అని దర్యాప్తు చేస్తున్నారు.