అగ్ర కథానాయిక త్రిష సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పడం చాలా అరుదు. తన మాతృభాష తమిళంలో సైతం ఓ ఐదు చిత్రాలకు మాత్రమే సొంతంగా డబ్బింగ్ చెప్పింది. ఇక తెలుగులో ఈ భామ పూర్తిగా డబ్బింగ్ ఆర్టిస్టులపైనే ఆధారపడుతుంది. తాజా సమాచారం ప్రకారం దాదాపు 11 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత త్రిష తమిళంలో సొంత గొంతును వినిపించబోతున్నది. సూర్య ‘కరుప్పు’ సినిమాలో త్రిష కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇందులో ఆమె తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకోబోతున్నదట. పాత్రలో సహజత్వం కనిపించాలంటే ఓన్ డబ్బింగ్ అవసరమని దర్శకుడు ఆర్జే బాలాజీ సూచన మేరకు త్రిష ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. త్రిష వాయిస్ సినిమాకు ప్రత్యేకాకర్షణగా నిలుస్తుందని, ఇకపై కూడా ఈ సొగసరి డబ్బింగ్ విషయంలో సొంత గొంతు వినిపించేందుకు సిద్ధంగా ఉందని తమిళ ఫిల్మ్‌నగర్ టాక్. ‘కరుప్పు’ చిత్రం మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.