హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రవాణా శాఖ పలు రకాల పన్నులతో వాహనదారులను పీల్చి పిప్పిచేస్తున్నది. జీవితకాల, త్రైమాసిక పన్నులు, గ్రీన్ ట్యాక్స్, ఇతర సర్వీస్ ఫీజులు, వాహన జరిమానాల పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నది. గత 9 నెలల్లో రూ.5,142 కోట్లు పిండుకున్నది. ఇది 2025-26 వార్షిక రాబడి లక్ష్యం (రూ.6,165 కోట్ల)లో 83 శాతానికి సమానం. ఇందులో జీవితకాల పన్నుల ద్వారా రూ.3,611 కోట్లు, త్రైమాసిక పన్నుల ద్వారా రూ.730 కోట్లు, గ్రీన్ టాక్స్ ద్వారా రూ.57 కోట్లు, ఫీజుల ద్వారా మరో రూ.408 కోట్లు, వాహన జరిమానాల ద్వారా రూ.181 కోట్లు, సర్వీస్ చార్జీల ద్వారా రూ.153 కోట్లు రాబట్టుకున్నట్టు ఉన్నతాధికారులు మంగళవారం ప్రకటించారు.
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అడ్డగోలు చార్జీలు వసూలు చేసినా, సరుకులు రవాణా చేసినా, స్టేజీ క్యారియర్లుగా బస్సులను నడిపినా కఠిన చర్యలు చేపడుతామని రవాణా శాఖ హెచ్చరించింది. అందులో భాగంగా ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలకు విరుద్ధంగా తిరిగే వాహనాలను నియంత్రించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించింది.