హైదరాబాద్, జూన్1(నమస్తే తెలంగాణ): ఎక్సైజ్ శాఖలో ఉన్న ఏడు కంటిగ్వాస్ జిల్లాల్లో 303 మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీలు జరిగాయని, ఇందులో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్స్ ఐదుగురికి మాత్రమే యథాస్థానాన్ని కొనసాగించామని ఎక్సైజ్ కమిషనర్ చేవూరి హరికిరణ్ పేర్కొన్నారు. ఈ ఐదుగురు ఆఫీస్ బేరర్స్‌లో, స్టాఫ్ ఆఫీసర్‌గా ఉన్న కేవలం ఒక ఆఫీస్ బేరర్‌కు మాత్రమే కమిషనర్ స్థాయిలో ఉత్తర్వులిచ్చామని, మిగిలిన నలుగురు అఫీస్ బేరర్లకు జిల్లా ఎక్సైజ్ అధికారులు (డీపీఈవో) ఉత్తర్వులిచ్చారని వివరించారు. వారు ఇచ్చిన ఉత్తర్వులతో తనకు సంబంధం లేదని పేర్కొన్నారు. ‘ఉద్యోగ నేతలకు బదిలీల్లో తాయిలం’ అనే శీర్షికతో సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనం రాష్ట్ర ఎక్సైజ్ శాఖలో సంచలనం సృష్టించింది.
ఈ నేపథ్యంలో ‘నమస్తే’ కథనం అవాస్తవం అంటూ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అవాస్తవ కథనాలు ప్రచరించే ముందు నిబంధనలపై అవగాహన పెంచుకొని వాస్తవాలను ప్రచురిస్తే బాగుంటుందని కమిషనర్ తన ప్రకటనలో స్పందించా రు. ఇలాంటి ఖండనలు ఎక్సైజ్ కమిషనర్ పే రుతో వస్తాయి. ఎక్సైజ్ కమిషనర్ కార్యా లయం పేరిట రావడం గమనార్హం. దిగువ స్థాయి అధికారులు ఇచ్చిన ఉత్తర్వులతో తనకు సంబంధం లేదని కమిషనర్ స్థాయి అధికారి చెప్పుకోవటంలోనే బదిలీల సిత్రాల్లోని డొల్లతనం బయటపడింది. ఒక వేళ పాత్రికేయుడు అవగాహన లేకుండా రాసిన కథనానికి మరుసటి రోజు ఖండన రాసి, తప్పు సరిదిద్దుకొనే అవకాశం ఉన్నది.
కానీ ఉన్నతాధికారి నిబంధనలు విస్మరించి తీసుకున్న నిర్ణయాలకు దిగువ శ్రేణి ఉద్యోగులు బలైతే ఎవరు బాధ్యత తీసుకుంటారు?.
ఎక్సైజ్ కమిషనర్ : జనరల్ అడ్మినిస్ట్రేషన్ జారీ చేసిన మెమో నంబరు 20914/2012, తేదీ 26/6/2012, 30/6/2012లో సూచించిన మార్గదర్శకాలు, జీవో ఎంఎస్ నంబర్ 38 తేదీ: 21/4/2026 ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్గదర్శకాలకు అనుగుణంగా పోస్టింగ్‌లు ఇచ్చాం. కేవలం ఐదుగురు గుర్తిం పు పొందిన ఉద్యోగ సంఘాల ఆఫీస్ బేరర్స్‌ను మాత్రమే వారు ఉన్నచోటనే కొనసాగించాం.
నమస్తే: మెమో నంబర్ 20914/2012 మార్గదర్శకాల్లో నాలుగు ప్రధాన సూచనలు చేశారు. ఇందులో గుర్తింపు పొందిన సంఘాలకు నిబంధనలు వర్తిస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. కానీ ఎక్కడా అనుబంధ సంఘాల నా యకులకు కూడా ఇదే వెసులుబాటు ఉంటుందనే సూచనల్లేవు. ‘గుర్తింపు పొందిన సంఘాల కార్యవర్గ సభ్యులు, వారి ఉద్యోగకాలం, కార్యాలయాల్లో ఆరేండ్లు, అంటే.. రెండేండ్ల ఉద్యోగకాలం ఉన్నవారికి 3 పర్యాయాలు లేదా మూడేండ్ల ఉద్యోగకాలం ఉన్నవారికి రెం డు పర్యాయాలు పూర్తికాక ముందే జిల్లా, తాలూకా కేంద్రాల నుంచి బదిలీ చేయరాదు’ అని సూచన నంబర్ 1లోనే స్పష్టంగా ఉన్నది. పైగా సేమ్ పోస్టింగ్‌లో కొనసాగించాలని ఉత్తర్వుల్లో ఎక్కడా పొందుపరుచలేదు. 8 ఏండ్ల నుంచి కొనసాగుతున్న అనుబంధ సంఘం నాయకులకు సేమ్ పోస్టింగ్ ఇచ్చారు. ఇది ఏ మార్గదర్శకాల ప్రకారం సాధ్యమైంది?
ఎక్సైజ్ కమిషనర్: కానిస్టేబుళ్ల బదిలీలకు సంబంధించిన 8ఎఫ్ నిబంధన ప్రభుత్వం మెమో నంబర్ 14055/2025/2 రెవెన్యూ ఎక్సైజ్ శాఖ, తేదీ: 2/3/2026లో జారీ చేసింది. ప్రభుత్వం నిర్దేశించిన 8 ఎఫ్ నిబంధనను కమిషనర్ అమలు పరిచారు. 8 ఎఫ్ నిబంధన మినిస్టీరియల్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన జీవో 38 మార్గదర్శకాల్లో లేదు.
నమస్తే: ఎక్సైజ్ శాఖ బదిలీల మొత్తానికి సంబంధించి జీవో 143 మార్గదర్శకాలు ఉండగా.. కొత్తగా ఈ జీవో 38 ఎందుకు తెచ్చినట్టు? మినిస్టీరియల్ ఉద్యోగులు ఎక్సైజ్ శాఖ లో అంతర్భాగం కాకుంటే కేవలం తమకే దక్కాల్సిన ఎస్సై ప్రమోషన్ల కోటాను మినిస్టీరియల్ ఉద్యోగులకు ఎందుకు పంచుతున్నారని రేపుపొద్దున ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుళ్లు అడిగితే ఏం చెప్తారు? మినిస్టీరియల్, ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల మధ్య జీవో 38 గొడవలు సృష్టించదా? 8 ఎఫ్ నిబంధనలు ఎంత మంది మ హిళా కానిస్టేబుళ్ల ఉసురు పోసుకుంటున్నా యో ఆ శాఖ బాస్ ఒక నివేదిక తెప్పించుకుం టే అర్థమవుతుంది. ఈ నిబంధన ప్రభుత్వం పెట్టిందని పెద్దలు చేతులు దులుపుకోవచ్చు. కానీ ప్రత్యక్షంగా కమిషనర్ స్థాయి అధికారి ఇచ్చే నివేదికతోనే ఉత్తర్వులు వస్తాయనే విషయం కానిస్టేబుళ్లకు తెలియదా?
ఎక్సైజ్ కమిషనర్: ఐదుగురు ఆఫీస్ బేరర్స్‌లో స్టాఫ్ ఆఫీసర్‌గా ఉన్న ఒక్క ఆఫీస్ బేరర్‌ను మాత్రమే కమిషనర్ స్థాయిలో ఉత్తర్వు లు జారీ చేశాం. మిగిలిన నలుగురు అఫీస్ బేరర్లకు డీపీఈవోలు తమ పరిధిలో పరిశీలించి ఉత్తర్వులిచ్చారు.
నమస్తే: కమిషనర్ అధికారి ప్రమేయం లేకుండా దిగువ శ్రేణి అధికారులు బదిలీలు, పోస్టింగ్‌ల్లో స్వయం నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్సైజ్ శాఖలో ఉన్నదా? నిజంగా అలాంటి వెసులుబాటే ఉంటే సాక్షాత్తు కమిషనర్ కార్యాలయంలో నిజామాబాద్ డీసీ సోమిరెడ్డి తరహా ఘటన జరిగి ఉండేదా? నోడల్ ఈఎస్‌లు అధికారం మేరకు చేయాల్సిన కానిస్టేబుళ్ల బదిలీలను ఎవరు కర్రపట్టుకొని చేశారో ఎక్సైజ్ శాఖకు తెలియంది కాదు. ఆఫీస్ బేరర్స్‌కు పోస్టింగ్ ఇచ్చే క్రమంలో ‘మనం చేస్తున్నది తప్పు సర్’ అని ఓ అధికారి చేసిన సూచనలు కమిషనర్ పరిగణనలోకి తీసుకున్నారా?