సుల్తాన్‌బజార్/హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైగింక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని చంచల్‌గూడ జైలుకు తరలించారు. బుధవారం ఆయనను వైద్యపరీక్షలకు ఉస్మానియా దవాఖానకు తరలించారు. అనంతరం ఉప్పర్‌పల్లి కోర్టులో హాజరుపరచడంతో న్యాయస్థానం 14 రోజులపాటు రిమాండ్ విధించింది. దీంతో నిందితుడిని పోలీసులు చంచల్‌గూడ జైలుకు తరలించారు. పోలీసులు ఉదయ్‌కృష్ణారెడ్డిని ఉస్మానియా దవాఖానకు తీసుకొస్తున్నారన్న సమాచారం తెలియడంతో విలేకరులు అక్కడికి చేరుకున్నారు. విధుల్లో భాగంగా అక్కడి దృశ్యాలను వీడియో తీస్తున్న ఓ విలేకరిపై ఉదయ్‌కృష్ణారెడ్డి దురుసుగా వ్యవహరిస్తూ ఫోన్‌ను లాక్కునేందుకు యత్నించాడు. ఆ విలేకరి కింద పడిపోవడంతో ఉదయ్ కృష్ణారెడ్డి తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పోలీస్ అకాడమీలో కర్ణాటకకు చెందిన మహిళా ట్రైనీ ఐపీఎస్‌పై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉదయ్ కృష్ణారెడ్డి గతంలో హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని నివాసమున్నాడు. లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో అత్తాపూర్ పోలీసులు ఆ ఇంటిని పరిశీలించారు.
తనపై దాఖలైన లైంగిక వేధింపుల కేసును కొట్టివేయాలని కోరుతూ హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ జే శ్రీనివాసరావు బుధవారం విచారణ చేపట్టారు. ఈ పిటిషన్‌పై వివరణ ఇవ్వాలని ప్రభుత్వంతోపాటు ఫిర్యాదుదారైన మహిళా ట్రైనీ ఐపీఎస్‌ను ఆదేశించారు. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని వారికి నోటీసులు జారీచేసి, తదుపరి విచారణను ఆగస్టు 26కు వాయిదా వేశారు.