న్యూఢిల్లీ, డిసెంబర్ 7: టెలికం సంస్థలు మొబైల్ వినియోగదారులకు బ్యాలెన్స్‌తో నిమిత్తం లేకుండా పోర్ట్ ఔట్ ఎస్ఎంఎస్లకు అనుమతినివ్వాలని మంగళవారం ట్రాయ్ ఆదేశించింది. మొబైల్ నంబర్ పోర్టబిలిటి (ఎంఎన్‌పీ) కోసం 1900కు ప్రీ-పెయిడ్ కస్టమర్ ఎస్ఎంఎస్ పంపించాలనుకుంటే ఖాతాల్లో సరిపడా బ్యాలెన్స్ లేదంటూ టెలికం సంస్థలు సదరు ఎస్ఎంఎస్ను తిరస్కరిస్తున్నాయని ట్రాయ్ ఆక్షేపించింది. ఇందుకు సంబంధించి ఇటీవలికాలంలో తమకు మొబైల్ వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయని పేర్కొన్నది.
దీంతో కస్టమర్ ప్లాన్ లేదా వోచర్లో బ్యాలెన్స్ ఉన్నా.. లేకున్నా.. ఎంఎన్‌పీకి టెలికం ఆపరేటర్లు సహకరించాల్సిందేనని ట్రాయ్ స్పష్టం చేసింది. తక్షణమే దీన్ని పాటించాలనీ సూచించింది. ప్రీ-పెయిడ్ కస్టమర్ కావచ్చు, పోస్ట్‌పెయిడ్ కస్టమర్ కావచ్చు.. పోర్ట్ ఔట్ ఎస్ఎంఎస్ సెండింగ్‌కు ఎటువంటి అంతరాయం కలుగవద్దని చెప్పింది. భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో ఇటీవలే తమ ప్లాన్ల ధరలను పెంచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కస్టమర్లు తమ నెట్‌వర్క్‌లను మార్చుకోవడం పెరిగిపోయింది. దీంతోనే పోర్ట్ ఔట్ ఎస్ఎంఎస్ అంశంపై ట్రాయ్ సీరియస్‌గా దృష్టి సారించి తాజా ఆదేశాలను జారీ చేసింది.