వరంగల్ : ఆరువేల మంది పోలీసులతో మేడారం జాతరకు తరలివచ్చే వాహనాలను నియంత్రిస్తామని వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోపి తెలిపారు.
ఫిబ్రవరి 16 నుంచి 19వరకు జరిగే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా ట్రాఫిక్ జోన్ ఇంచార్జ్ గా వ్యవహరిస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఈస్ట్ జోన్ డిసిపి వెంకటలక్ష్మి , లా అండ్ ఆర్డర్ అదనపు డిసిపి సాయి చైతన్యత, సెంట్రల్ జోన్ ఇంచార్జ్ డిసిపి పుష్ప, అదనపు డిసిపి వైభవ్ గైక్వాడ్ తొ కలిసి పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు.
రెండు ముఖ్యమైన లక్ష్యాలతో పోలీసులు మేడారం జాతర బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. ఇందులో ఒకటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అమ్మవార్ల దర్శించుకోవడంతో పాటు, క్షేమంగా వారి గమ్యస్థానాలకు చేరుకోవడం.
అలాగే ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా జాతరను పూర్తిగా విజయవంతం చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన పేర్కొన్నారు. వరంగల్ నుంచి తరలివచ్చే ప్రైవేట్ వాహనాలు గుడెప్పాడు, ములుగు, పస్రా, నార్లపూర్కు చేరుకొని పోలీసులు సూచించిన పార్కింగ్ ప్రదేశాల్లో వాహనాలను పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
వరంగల్ నుంచి బయలుదేరి వేళ్లే ఆర్టీసీ బస్సులు గుడెప్పాడు, మల్లంపల్లి, ములుగు, పస్రా, తాడ్వాయి మీదుగా మేడారంకు చేరుకుంటాయి. ఇదే మార్గంలో ఆర్టీసీ బస్సులు వరంగల్ కు చేరుకుంటాయి. ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చే ప్రైవేట్ వాహనాలు ఎటూరునాగరం, చిన్నబోయినపల్లి, కొండాయి, ఉరట్టం వద్ద పార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.
తిరుగు ప్రయాణంలో ఇదే మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుందని సీపీ స్పష్టం చేశారు. ఇక కరీంనగర్, కాళేశ్వరం ఆపై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు కాటారం, పెగడపల్లి, కాల్వపల్లి, ఉరట్టంలో పార్కింగ్ చేసుకోవాలి. తిరుగు ప్రయాణంలో బయ్యక్కపేట, దుదేకులపల్లి మీదుగా కరీంనగర్ చేరుకోవాల్సి వుంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు.
తిరుగు ప్రయాణంలో గత జాతరలో అవలంభించిన పద్ధతిని ఈసారి కూడా అమలు చేస్తామన్నారు. మేడారం నుంచి తిరిగి వరంగల్ ఆపై ప్రాంతాలకు తిరిగి వెళ్ళే వాహనాలు తిరుగు ప్రయాణంలో ప్రైవేట్ వాహనాలు నార్లపూర్ క్రాస్, బయ్యక్కపేట, గొల్లబుద్దారం, దుదేకులపల్లి, కమాలాపూర్ క్రాస్, భూపాలపల్లి, పర్కాల, అంబాల, అంబాల క్రాస్, కిట్స్ కాలేజ్, వరంగల్ బైపాస్, కరుణాపురం, పెండ్యాల మీదుగా వాహనాలు తిరిగిపోవాల్సి ఉంటుందన్నారు.
ట్రాఫిక్ పర్యవేక్షణకై గట్టమ్మ గట్ట నుంచి పస్రా వరకు మొత్తం 320 సి.సి కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా జాతరకు వాహనాలపై తరలివచ్చే భక్తులు మధ్యం సేవించి నడపవద్దని, అదే విధంగా ఒకదాని వెనుక ఒకటి వాహనాన్ని నడపాలని సూచించారు. రోడ్లపై వాహనాలను నిలపరాదని పోలీస్ కమిషనర్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.