హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ) : అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షబ్బీర్ అలీ ఎపిసోడ్ మర్చిపోకముందే టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీనటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు గురైన ఉదంతాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం సీరియస్‌గా పరిగణిస్తున్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చెప్పారు. ఓ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఆమెపై ఉన్న కేసు విషయాన్ని ఎవరో ఒకరు లీక్ చేసి ఉండొచ్చని అన్నారు.
దీనిపై విచారణ జరుగుతున్నదని చెప్పారు. తనను కూడా పిలిచి విచారణ జరిపారని వెల్లడించారు. ఏఐసీసీ సమావేశంలో దీనిపై తాను వివరణ ఇచ్చానని పేర్కొన్నారు. అలాగే ఇటీవలి బెంగళూరులో రేవంత్ చేసిన ‘హిట్లర్’ వ్యాఖ్యలపైనా మహేశ్‌కుమార్ స్పందించారు. హిట్లర్ స్ఫూర్తి అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఏకీభవించను అంటూ ఆయన కుండబద్ధలు కొట్టారు. అది రేవంత్ వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టంచేశారు. దీనిపై ఢిల్లీలో కూడా చర్చ జరిగిందని తెలిపారు. హిట్లర్‌ను ప్రపంచమంతా విలన్‌గా చూస్తుంటారని, అలాంటప్పుడు రేవంత్ ‘హిట్లర్’ వ్యాఖ్యలను ఎవరు సమర్థిస్తారంటూ ఆయన వ్యాఖ్యానించారు.