పెషావర్: ముస్లింలకు పవిత్రమైన ఖురాన్‌ను అవమానించి, దానిని అపవిత్రం చేశాడని ఆరోపిస్తూ ఒక టూరిస్టుపై పాకిస్థాన్‌లో ఒక అల్లరి మూక దారుణానికి ఒడిగట్టింది. వేలాది మంది పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసి నిప్పంటించడంతో పాటు, లాకప్‌లో ఉన్న ఆ టూరిస్టును కాల్చి చంపారు. అనంతరం అతడి శవాన్ని ఈడ్చుకుంటూ వచ్చి బహిరంగంగా ఉరితీసి వేలాడదీసిన ఘటన స్వాట్ పట్టణంలో చోటుచేసుకుంది. సియోల్‌కోట్‌కు చెందిన మహ్మద్ ఇస్మాయిల్ స్వాట్ జిల్లా పర్యటనలో ఖురాన్‌లోని పేజీలను దగ్ధం చేశాడు. దీంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్‌లో ఉంచారు. ఇస్మాయిల్ దుశ్చర్యపై లౌడ్ స్పీకర్ల ద్వారా బహిరంగంగా ప్రకటించడంతో వేలాది మంది పోలీస్ స్టేషన్‌కు చేరుకొని అతడిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజలు రెచ్చిపోవడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో 8 మంది గాయపడ్డారు. దీంతో మరింత ఆగ్రహం చెందిన అల్లరి మూక పోలీస్ స్టేషన్‌కు నిప్పంటించారు. లాకప్‌లో ఉన్న ఇస్మాయిల్‌ను కాల్చి చంపి, అతని మృతదేహాన్ని ఈడ్చుకుంటూ వచ్చి బహిరంగంగా ఉరితీసి వేలాడదీసింది.