దహెగాం, జనవరి 2: మహారాష్ట్రలో వేటగాళ్లు అమర్చిన విద్యుత్తు తీగలు తగిలి మృతి చెందిన పెద్దపులికి సంబంధించిన తల కోసం మహారాష్ట్ర, తెలంగాణ అటవీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గత నెల 25న మహారాష్ట్రలోని మోసం గ్రామానికి చెందిన ఐదుగురు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం దిగిడ గ్రామానికి చెందిన నలుగురు మోసం బీట్ అటవీ ప్రాంతంలో జంతువుల వేట కోసం కరెంట్ తీగలు అమర్చారు. తీగలకు తగిలి పెద్దపులి మృతిచెందింది. తర్వాత పులి కాళ్లు, తల, మీసాలు తీసుకొని కళేబరాన్ని పూడ్చిపెట్టారు. గత నెల 30న దుర్వాసన రావడంతో సిబ్బంది పరిశీలించగా, పులి కళేబరం కనిపించింది. రంగంలోకి దిగిన అధికారులు విచారణ చేపట్టారు.
మహారాష్ట్రకు చెందిన ఐదుగురు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దిగిడ గ్రామానికి చెందిన నలుగురు వేటగాళ్లు ఉన్నట్టు అంచనాకు వచ్చారు. ముగ్గురు మహారాష్ట్ర వాసులతోపాటు దిగిడకు చెందిన పొర్తిట్టి కాంతారావును అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర వేటగాళ్ల వద్ద 7 పులి గోర్లు, కాంతారావు వద్ద ఒక గోరు, మీసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మిగతా పులి గోర్లు, తల కోసం అధికారులు తనిఖీలు చేస్తున్నారు.