
పాల్వంచ రూరల్/ఉట్నూర్ రూరల్, నవంబర్ 22 : మూడేండ్లకోసారి జరిగే ఆలిండియా టైగర్ ఎస్టిమేట్ కార్యక్రమం రాష్ట్రంలో సోమవారం ప్రారంభమైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని కిన్నెరసాని వైల్డ్‌లైఫ్ ఆధ్వర్యంలో అటవీ ప్రాంతాల్లో పులుల గణన చేపట్టారు. మూడ్రోజులపాటు జరుగనున్న ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం మండలంలోని మామిళ్లవాయి, కారెగట్టు, సారెకల్లు అటవీ ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. నీటి తొట్టెలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో పరిశీలించారు. కొన్ని జంతువుల పాదముద్రలను సేకరించారు. ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూర్, భీంపూర్ మండలాల్లోని అటవీ ప్రాంతంలో సైతం అధికారులు జంతు గణన మొదలుపెట్టారు.