న్యూఢిల్లీ, మే 26: కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి అంజరియా, గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ్ బిష్ణోయ్, బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏఎస్ చందూర్కర్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సోమవారం కేంద్రానికి సిఫార్సు చేసింది. మాజీ సీజేఐ సంజీవ్ ఖన్నా, న్యాయమూర్తులు జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ హృషికేష్ రాయ్ పదవీ విరమణతో సుప్రీంకోర్టులో ఏర్పడిన మూడు ఖాళీలను భర్తీ చేసేందుకు సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన కొలీజియం ఈ ముగ్గురి పేర్లను సిఫార్సు చేసింది. మే 26న జరిగిన కొలీజియం సమావేశంలో ఈ ముగ్గురికీ పదోన్నతి కల్పించాలని సిఫార్సు చేసినట్లు సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తీర్మానం పేర్కొంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం త్రివేది కూడా జూన్ 9న పదవీ విరమణ చేయనున్నారు. సుప్రీంకోర్టులో ఆమె చివరి పని దినం మే 16. సుప్రీంకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల సంఖ్య 34 కాగా ప్రస్తుతం 31 మంది న్యాయమూర్తులు సుప్రీంకోర్టులో ఉన్నారు.