గత నాలుగేళ్లలో అగ్ర హీరో షారుక్ ఖాన్ సినిమా ఒక్కటీ విడుదల కాకపోవడం అటు అభిమానులనే కాదు చిత్ర పరిశ్రమనూ ఇబ్బంది పెట్టింది. షారుక్ కెరీర్ ప్రారంభం నుంచీ వచ్చిన సుదీర్ఘ విరామం ఇదే అనుకోవచ్చు. 2018లో ‘జీరో’ సినిమాలో నటించిన తర్వాత షారుక్ చిత్రాలేవీ విడుదల కాలేదు. ఆ సినిమా అపజయం పాలవడం…వెంటనే మరో సినిమా సెట్స్ మీదకు వెళ్లకపోవడం..ఈలోగా పాండమిక్ రావడం అన్నీ వెరసి షారుక్‌ను తెరపై చూడకుండా చేసేశాయి. ఆయనకు కూడా ఇది విసుగు తెప్పించేదేమో..ఈ గ్యాప్‌ను వరుస చిత్రాలతో నింపేస్తున్నాడు. యష్‌రాజ్ ఫిలింస్‌లో ‘పఠాన్’ చిత్రంతో పాటు దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీ సినిమా, తమిళ దర్శకుడు అట్లీతో మరో చిత్రాన్ని చేస్తున్నారు. ‘పఠాన్’ సినిమా ప్రస్తుతం చిత్రీకరణలో ఉండగా…రాజ్‌కుమార్ హిరానీ, అట్లీ చిత్రాలు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయి. త్వరలో వీటి చిత్రీకరణలో పాల్గొంటూ ఏడాది చివరకు మొత్తం మూడు సినిమాలు పూర్తి చేయాలని భావిస్తున్నారట షారుక్. దీంతో ఈ స్టార్ చిత్రాలే ఇక వరుసగా విడుదలకు రానున్నట్లు తెలుస్తున్నది.